సీఎం రేవంత్‌రెడ్డికి అందజేసిన క్యాబినెట్ సబ్ కమిటీ
హైదరాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): జీవో 317పై క్యాబినెట్ సబ్ కమిటీ ఆదివారం తన తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. సబ్ కమిటీ చైర్మన్, మంత్రి దామోదర రాజనర్సింహ, సభ్యుడు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదివారం నివేదిక ప్రతిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జీవో 317పై రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షత వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ కమిటీలో సభ్యులు. 317 జీవోలో ఉన్న సమస్యలపై సబ్ కమిటీ అనేకసార్లు సమావేశాలు ఏర్పాటు చేసింది.
ఉపాధ్యాయ సంఘాలు, ఉన్నతాధికారులు, మేధావులతో క్యాబినెట్ సబ్ కమిటీ చర్చించింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ఉద్యోగుల అభిప్రాయాలను, వినతులను సేకరించింది. జీవోపై తుది నివేదికకు సంబంధించిన పత్రాలను సీల్డ్ కవర్‌లో ఉంచి, సీఎం రేవంత్ రెడ్డికి సబ్ కమిటీ అందజేసింది.
మొదటి నుంచి ఈ జీవో వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం భావించింది. అందుకే ఈ జీవోపై సీఎం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.