calender_icon.png 15 April, 2025 | 4:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గీకరణ అమలుకు జీవో

14-04-2025 01:14:29 AM

  1. అంబేద్కర్ జయంతి సందర్భంగా విడుదల
  2. మొదటి కాపీ సీఎం రేవంత్‌రెడ్డికి అందిస్తాం
  3. సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
  4. ఎస్సీ వర్గీకరణ చట్టానికి క్యాబినెట్ ఆమోదం
  5. సమావేశానికి హాజరైన జస్టిస్ షమీమ్ అక్తర్

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): దేశంలోనే ఎస్సీ వర్గీకరణ అమలుకు జీవో విడుదల చేస్తున్న మొద టి రాష్ట్రం తెలంగాణ అని, అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం నుంచి వర్గీకరణ అమలవుతుందని రాష్ట్ర సాగునీటి పారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఆదివారం ఆయన అధ్యక్షతన హైదరాబాద్ లోని సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ జరిగింది.

ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిందని,  బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సైతం ఆమోదముద్ర వేశారని గుర్తుచేశారు. అంబేద్కర్ జయంతి రోజు నుంచి వర్గీకరణ అమలుకు నోచుకోవడం శుభపరిణామని కొనియాడారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న వర్గీకరణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే  పరిష్కరించిందన్నారు.

మంత్రివర్గ ఉప సంఘం ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ తొలి ప్రతిని తాము సీఎం రేవంత్‌రెడ్డికి అందజేస్తామని వెల్లడించారు. జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో కమిషన్ రూపొందించిన సిఫార్సులు అధ్యయనం చేసి మరీ చట్టాన్ని ఆమోదించామని వివరించారు. మొత్తం 59 ఎస్సీ ఉపకులాల్లో అంతర్గత వెనుకబాటుతనం ఆధారంగా మూడు గ్రూపులుగా విభజించామని, అత్యంత వెనుకబాటులో ఉన్న 15 ఉప కులాలను మొదటి గ్రూప్‌లో పెట్టామన్నారు.

వారి జనాభా ఆధారంగా ఒక శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. రెండవ గ్రూపులో రిజర్వేషన్లతో అంతంతమాత్రం లబ్ధిపొందిన 18 ఉప కులాలను గుర్తించామని స్పష్టం చేశారు. వీరి జనాభా 62.74 శాతం ఉన్నందున వీరికి 9 శాతం రిజర్వేషన్లు కేటయించామన్నారు.

మూడో గ్రూపులో పై రెండు గ్రూపులతో పోలిస్తే ఒకింత ముందున్న 26 కులాల జనాభా 33.963 ఉండగా, వీరికి 5శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నట్లు తేల్చిచెప్పారు. వర్గీకరణ కోసం తమ ప్రభుత్వం ఎస్సీల ఆర్థిక స్థితిగతులపై లోతుగా అధ్యయనం చేశామని, మొత్తం 8,600కు పైగా వినతులను స్వీకరించి, వాటిని పరిశీలించామని వెల్లడించారు.

ఎస్సీ వర్గీకరణ అమలు చేసి తాము ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. కమిషన్ ప్రతిపాదించినట్లు క్రీమిలేయర్ విధానాన్ని తిరస్కరించామని వివరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్సీల జనాభా 17.5శాతం ఉందని, 2026 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని ఇప్పుడు 15 శాతం ఉన్న ఎస్సీల కోసం రిజర్వేషన్లు పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

సమావేశంలో మంత్రులు దామోదరం రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎస్సీ వర్గీకరణ వన్‌మాన్ కమీషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్, ఎస్సీ అభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.