27-03-2025 12:04:51 AM
అవినీతికి వ్యతిరేకంగా పెద్దఎత్తున జిన్‌పింగ్ ఉద్యమం..
బీజింగ్: దేశంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పెద్ద ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఆయన బంధువులు, కుటుంబసభ్యులకు మాత్రం వందల కోట్ల విలువజేసే ఆస్తులు, వ్యాపారాలు ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికాకు చెందిన కొన్ని నిఘావర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ రేడియో ఫ్రీ ఏషియా అనే మీడియా సంస్థ కథనాన్ని వెలువరిచింది. జిన్‌పింగ్ 2012లో చైనాలో అధికారం చేపట్టారు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలోని అన్ని శ్రేణుల్లో అవినీతి నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.
దీంతో లక్షలాది మంది అధికారులు దర్యాప్తును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంతో మందికి కఠిన శిక్షలు కూడా పడ్డాయని సదరు నివేదిక పేర్కొంది. అయితే ఈ సమయంలోనే జిన్‌పింగ్ కుటుంబానికి మాత్రం అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూరాయని నివేదిక ఆరోపించింది. చైనా ప్రభుత్వంలో ఒకప్పుడు భారీగా అవినీతి కార్యకలాపాలు జరిగాయని నివేదిక ఆరోపించింది. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌లో సభ్యత్వంతో కొందరు ఈ అక్రమాలకు పాల్పడినట్టు వెల్లడించింది. ఇదిలా ఉండగా జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చాక 2012 నుంచి 2022 మధ్య 50 లక్షల మంది అధికారులు దర్యాప్తును ఎదుర్కొన్నారు. వీరిలో 47 లక్షల మంది దోషులుగా తేలినట్టు అమెరికా మద్దతు ఉన్న ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది.