బీజేపీ పార్టీ ఎంపీలకు విప్ జారీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ‘వన్ నేషన్ ఎలక్షన్’ బిల్లు నేడు పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉంది. జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ఈ రోజు మధ్యాహ్నం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికల నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ విస్తృత సంప్ర దింపుల కోసం బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపించాలని స్పీకర్‌ను కోరే అవకాశం ఉంది. జమిలి బిల్లు పార్లమెంట్ ముందుకు రానున్న నేపథ్యంలో బీజేపీ తన పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది.
లోక్‌సభలో కీలక అంశాలపై చర్చ జరగనున్నందున సభ్యులెవ్వరూ మంగళవారం గైర్హాజరు కావొద్దంటూ లోక్‌సభ లో బీజేపీ చీఫ్ విప్ డాక్టర్ సంజయ్ జైస్వాల్ ఓ లేఖను విడుదల చేశారు. కాగా, జమిలి ఎన్నికలపై మొదటి నుంచి పట్టుదలతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ‘వన్ నేషన్ ఎలక్షన్’ బిల్లును డిసెంబర్ 16నే లోక్‌సభలో ప్రవేశపెట్టాలని భావించింది. అయితే కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం సోమవారం బిల్లును ప్రవేశపెట్టలేదు.