calender_icon.png 4 January, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేపీసీకి జమిలి బిల్లు

21-12-2024 02:47:55 AM

  • 39 మంది ఎంపీలతో జేపీసీ 

కమిటీలో ఐదుగురు తెలుగు ఎంపీలకు స్థానం

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: వన్ నేషన్ ఎలక్షన్‌కు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ జాయింట్ పార్లమెంట్ కమిటీ(జేపీసీ)కి పంపింది. సమగ్ర అధ్యయనానికి స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం 39 మంది సభ్యులతో కూడిన జేపీసీకి జమిలి బిల్లును పంపించారు. దేశ వ్యాప్తంగా ఉన్న మేధావులు, న్యాయనిపుణులు తదితరులతో చర్చించి లోక్‌సభ స్పీకర్‌కు జేపీసీ తన సిఫార్సులను నిర్ధిష్ట సమయంలో అందజేయనుంది.

సాధారణంగా బిల్లుపై నివేదిక అందించడానికి జేపీసీకి గరిష్ఠంగా 90 రోజుల సమయం ఉంటుంది. అవసరమైతే ఆ గడువును మరింత పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. రాష్ట్రాల అధికారాలను కేంద్ర ప్రభుత్వం హరించాలని చూస్తోందని విపక్షాలు ఆరోపించాయి. బిల్లును సమగ్రంగా అధ్యయనం చేయడానికి జేపీసీకి పంపించాలని డిమాండ్ చేశాయి.

బిల్లును జేపీసీకి పంపేందుకు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం తొలుత లోక్‌సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులతో కూడిన జేపీసీని బుధవారం ప్రకటించింది. కానీ గురువారం రాత్రి జేపీసీ సభ్యుల సంఖ్యను 39కి పెంచుతూ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం జేపీసీలో 27 మంది లోక్‌సభ ఎంపీలు, 12 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. 

జేపీసీలో తెలుగు ఎంపీలు

జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు అధ్యయనానికి ఏర్పాటు చేసిన జేపీసీలో ఐదుగురు తెలుగు ఎంపీలకు అవకాశం దక్కింది. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్‌కు అవకాశం లభించింది. ఏపీ నుంచి లోక్‌సభ సభ్యులు సీఎం రమేష్, జీఎంహెచ్‌బాలయోగి, వల్లభనేని బాలశౌరికి చోటు దక్కింది. వైసీపీకీ చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సైతం అవకాశం లభించింది. ఈ జాబితాలో లక్ష్మణ్ చోటు దక్కించుకున్నా ఆయన రాజ్యసభలో ఉత్తర్ ప్రదేశ్  నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.