calender_icon.png 18 January, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేపీసీకి జమిలి బిల్లు

18-12-2024 01:03:01 AM

  1. లోక్‌సభలో ప్రవేశపెట్టిన 
  2. కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్‌వాల్
  3. బిల్లును జేపీసీకి పంపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న అమిత్ షా

బిల్లును ప్రవేశపెట్టేందుకు ఓటింగ్

అనుకూలం: 269 ఓట్లు 

వ్యతిరేకం: 198 ఓట్లు

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎట్టకేలకు తన మాట నెగ్గించుకుంది. ఎన్నికల్లో సమూల మార్పులకు ఉద్దేశించిన ‘వన్ నేషన్ ఎలక్షన్’కు సంబంధించిన బిల్లును మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. జమిలి బిల్లుకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన మరో బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ లోక్‌సభ ముందుకు తీసుకొచ్చారు.

దీంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. సుమారు 90 నిమిషాల చర్చ తర్వాత జమిలి బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలా? వద్దా? అనే అంశంపై స్పీకర్ ఓం బిర్లా సభలో ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 269 మంది సభ్యులు ఓటు వేయగా 198 మంది వ్యతిరేకించారు.

ఈ ఓటింగ్‌లో 2/3 మెజార్టీ (307 ఓట్లు) పొందడంలో ప్రభుత్వం విఫలం కావడంతో బిల్లును ప్రవేశపెట్టకూడదని ఇండియా కూటమి డిమాండ్ చేసింది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రత్యేక మెజార్టీ అవసరం లేకపోవడంతో జమిలి బిల్లును కేంద్ర మంత్రి మేఘ్‌వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 

సమగ్ర అధ్యయనం కోసం బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. బిల్లును జేపీసీకి పంపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రులు అర్జున్ మేఘ్‌వాల్, అమిత్ షాలు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ జమిలి బిల్లు క్యాబినెట్ ముందుకు వచ్చినప్పుడే జేపీసీకి పంపే అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపాదించినట్టు పేర్కొన్నారు. కాగా జేపీసీ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున త్వరలోనే స్పీకర్ ఓం బిర్లా జేసీపీ సభ్యులను ప్రకటించే అవకాశం ఉంది.

బీఆర్‌ఎస్, టీడీపీ మద్దతు

జమిలి బిల్లుకు మొత్తం 32 పార్టీలు మద్దతు తెలిపగా 15 పార్టీలు వ్యతిరేకించాయి. గతంలో ఈ బిల్లుపై తటస్థంగా ఉన్న టీడీపీ ఇప్పుడు సంపూర్ణ మద్దతు తెలిపింది. దీంతోపాటు వైసీపీ, బీఆర్‌ఎస్, ఏఐడీఎంకే తదితర పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపిన పార్టీల జాబితాలో ఉన్నాయి. కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని శివసేన(యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ తదితర పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి.

ఓటింగ్ సందర్భంగా శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేదీ మాట్లాడుతూ జమిలి బిల్లును రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. జమిలి బిల్లు రాజాయంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని.. దీన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ డిమాండ్ చేశారు.

రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ఈ బిల్లుతో ప్రభుత్వం బిడ్ వేస్తోందని.. జమిలి ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తాయని ఎస్పీ నేత ధర్మేంద్రయాదవ్ మండిపడ్డారు. బిల్లుపై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ జమిలి ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులనే దెబ్బతీయడమేన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం దేశానికి కావాల్సింది జమిలి ఎన్నికలు కాదు ఎన్నికల సంస్కరణలని పేర్కొన్నారు. జమిలి ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని.. ఇవి అధ్యక్ష తరహా పాలనకు దారితీసి ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తాయని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లును జేపీసీకి పంపాలని ఎన్సీపీ(ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే డిమాండ్ చేశారు. లేదంటే బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు.

అంతకు ముందు బిల్లు ప్రవేశపెట్టే సమయంలో అర్జున్ మేఘ్‌వాల్ మాట్లాడుతూ జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కొత్తది కాదన్నారు. 1983 నుంచి ఈ తరహా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ఉందన్నారు. దీనివల్ల రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని పేర్కొన్నారు.