- 2021-22, 2022-23 పనులపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిన కమిషనర్
- కొత్త ప్రభుత్వంలో చేసిన పనులకు మాత్రమే బిల్లుల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్
- 5 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని కాంట్రాక్టర్ల హెచ్చరిక
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుందా..? కాంట్రాక్టర్లు ఒకటనుకుంటే బల్దియా తీసుకునే నిర్ణయం రివర్స్ అవుతుందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.
రెండేళ్ల క్రితం పనులు పూర్తయ్యి, బిల్లులు అందజేసి, ఆడిట్ కూడా పూర్తయిన పనులపై విజిలెన్స్ ఎంక్వైరీ అనడం ప్రస్తుతం బల్దియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా కొత్త ప్రభుత్వం వచ్చిన ఏడాది నుంచి చేపట్టిన పనులపై కాకుండా..
రెండేళ్ల క్రితం చేపట్టిన పనులపై ఎంక్వైరీ అనడంతో బల్దియాలో తీవ్ర రచ్చ కొనసాగుతోంది. 2022 నాటి పనులపై సీసీఎస్‌లో కేసు నమోదు అంశం సైతం తెరపైకి వచ్చింది. ఏదీ.. ఏమైనా బయటకు గంభీరంగా కన్పించినా.. కాంట్రాక్టర్లు లోలోపల ఆందోళనగానే ఉన్నట్టుగా తెలుస్తుంది.
విజిలెన్స్ విచారణకు ఆదేశం..
బల్దియాలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రెండేళ్లకు పైగా దాదాపు రూ.1400 కోట్ల పెండింగ్ బిల్లుల వ్యవహారం కొన్ని నెలలుగా తరుచూ వివాదంగా మారుతోంది. వీటిలో 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలలో దాదాపు రూ.800 కోట్లు, ప్రస్తుత ఏడాది కాలానికి రూ. 400- రూ. 500 కోట్లు బకాయిలు ఉన్నాయి.
ఈ విషయంపై ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, గవర్నర్, రాష్ట్రపతి దాకా తమ బిల్లులు చెల్లించాలని కోరుతూ కాంట్రాక్టర్లు వినతులు అందజేశారు. ఈ నేపథ్యంలో మొత్తం కాకున్నా.. కొంచెంకొంచెం బిల్లులను బల్దియా చెల్లించడం ప్రారంభించింది. అత్యవసరమైన వారికి థ్రెడ్ ద్వారా బ్యాంకు రుణాలు అందజేస్తుంది.
ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీకి ఇద్దరు కమిషన్లు మారారు. ప్రస్తుత కమిషనర్ ఇలంబర్తి ప్రతినెలా రూ.200 నుంచి రూ. 300 కోట్ల దాకా చెల్లించేందుకు హామీ ఇచ్చారు. అయినాకూడా ఇటీవల కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ బల్దియా కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ పరిణామాన్ని బల్దియా కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే 2021-22, 2022-23 ఏడాదిలలో జరిగిన పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని, ప్రస్తుతం 2023-24 ఏడాదిలో బిల్లులను మాత్రమే చెల్లించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో 2022లో సీసీఎస్‌లో నమోదు అయిన కేసు సైతం తెరపైకి వచ్చినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల అంశం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి మరీ.
౫ రోజుల్లో కార్యచరణ ప్రకటిస్తాం: కాంట్రాక్టర్లు
బల్దియా కమిషనర్ తీసుకున్న విజిలెన్స్ విచారణ నిర్ణయం ఒక్కసారిగా కాంట్రాక్టర్లకు షాక్ ఇచ్చింది. దీంతో శనివారం సైతం కాంట్రాక్టర్లు బల్దియా కార్యాలయం వద్ద నిరసనకు సన్నద్దం అయ్యారు. అయితే ఫోన్‌లో ఓ నాయకుడితో మాట్లాడిన తర్వాత నిరసన ఉపసంహరించుకుని మీడియాతో మాత్రమే మాట్లాడారు.
విజిలెన్స్ విచారణపై మాకెలాంటి అభ్యంతరం లేదంటూనే.. వారం రోజుల్లో విచారణ పూర్తిచేసి మొత్తం బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం చేపట్టిన పనులకు నిబంధనలకు అనుగుణంగా అన్నిరకాల బిల్లులు సమర్పించడంతో పాటు ఆడిట్ కూడా పూర్తయ్యిందన్నారు.
బల్దియాకున్న అధికారాల మేరకు విజిలెన్స్ చేసినా.. మాకెలాంటి అభ్యంతరం లేదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మొత్తం పెండింగ్‌లో ఉన్న రూ.1300 కోట్లను తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రెండేళ్లకు పైగా బిల్లుల కోసం నిరీక్షిస్తున్న నేపథ్యంలో అనేక ఆర్థిక ఇబ్బందుల తో సతమతం అవుతున్నట్టు వాపోయారు.
మొత్తం బిల్లుల చెల్లింపుపై బల్దియా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని.. లేదంటే.. 5 రోజుల్లో తమ కార్యచరణ ప్రకటిస్తామని జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు.