calender_icon.png 26 October, 2024 | 9:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3 నెలల్లో 59 బైక్‌లు చోరీ

12-09-2024 12:00:00 AM

నిందితుడితో పాటు మరో ఇద్దరి అరెస్ట్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): మెట్రో పార్కింగ్ ప్రదేశాలే లక్ష్యంగా చేసుకొని ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని బేగంపేట పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నార్త్‌జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రాయుడు చైతన్య సాయికుమార్ కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సును మధ్యలో ఆపేశాడు.

2016లో హైదరాబాద్‌కు వచ్చి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ మద్యం, ధూమపానం వంటి చెడు వ్యసనాలకు బానిసయ్యా డు. ఈ క్రమంలో వివిధ కంపెనీల్లో పనిచేస్తూనే 2021లో ఈటీవీ మల్లెమాల ప్రొడక్షన్స్‌లో అసిస్టెంట్ కెమెరామెన్‌గా ఆరు నెలలు పనిచేశాడు. వచ్చే సంపాదన సరిపోకపోవడంతో బైక్‌ల చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ప్యారడైజ్, ఉప్పల్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లోని మెట్రో స్టేషన్లలో పార్కింగ్ స్థలాల్లో ఉంచిన వాహనాలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నాడు.

ఇలా 3 నెలల కాలంలోనే 59 బైక్‌లను చోరీ చేశాడు. చోరీల అనంతరం పోలీసులకు పట్టుబడకుండా ఉండడానికి ఆయా బైక్‌లను రైల్వే స్టేషన్, జేబీఎస్ బస్టాండ్ పార్కింగ్ వద్ద పార్కింగ్ చేసేవాడు. అనంతరం వాటికి ఆన్‌లైన్‌లో నకిలీ ఆర్సీలు సృష్టించి కొంతమంది ద్వారా విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో బేగంపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఓ బైక్ చోరీ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.

దీంతో చైతన్య సాయికుమార్‌తో పాటు బైక్ విక్రయాలకు సహకరించిన కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన మద్యానపు జగదీశ్, ఏపీలోని ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన కుంచాల హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 42 లక్షల విలువైన 59 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.