calender_icon.png 16 March, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజ్జుల తిమ్మభూపాలుడు.. అనర్ఘ రాఘవఅనువాద కవి

16-12-2024 12:00:00 AM

మన మాణిక్యాలు

“ఎట్టులున్నను న్యాయమార్గుక వృత్తి

కవని తిర్యక్కులైన సహాయమగును

గానితెరవున నడచిన వాని విడచు

ననుగు తోబుట్టువైన సత్యంబు సుమ్ము”

అంటూ ‘సత్యమార్గం లో, న్యాయ ప్రవృత్తి తో నడిచే వానికి తిర్యగ్జంతువులైనా సాయమం దిస్తా యి. కానీ, దుర్మార్గమైన దారిలో సాగే వానికి తోబుట్టువైనా సహకరించడ’ని బోధించే పద్యం ము రారి కవి రచించిన ప్రసిద్ధ సంస్కృత నాటకానువాదమైన తెలుగు పద్యకావ్యం ‘అనర్ఘ రాఘవం’ లోనిది. ఈ కావ్యకర్త బిజ్జుల తిమ్మభూపాలుడు.

బిజ్జుల తిమ్మభూపాలుడు రాజకవి. తెలు గు సాహితీ ప్రపంచంలో రాజకవులు పలువు రు ఉన్నారు. నన్నె చోడుడు, గోన బుద్ధారెడ్డి, శ్రీకృష్ణ దేవరాయలు, రఘునాథ నాయకుడు మొదలైన వారి సరసన నిలువ గలిగిన స్థాయిగల ఈ రాజకవి 17వ శతాబ్దానికి చెందిన వాడు. ఈయన ప్రాగటూరును రాజధానిగా చేసుకుని అలంపూరు సీమను పాలించిన పాలకుడు. 1675 ప్రాంతాన పుట్టిన బిజ్జుల తిమ్మభూపాలుని తాత పేరుకూడా తిమ్మభూపాలుడే. అంందుకే, ఆయనను ‘పెద తిమ్మభూపతి’గా చరిత్రకారులు పిలుస్తారు. 

మురారి అంతటి ప్రతిభావంతుడు

సంస్కృత భాషలో ‘అనర్ఘ రాఘవం’ అనే గొప్ప నాటకాన్ని రచించిన వారు మురారి కవి. సంస్కృత నాటకాల్లో ‘సంపూర్ణ రామాయణ’ కథతోకూడిన ప్రత్యేక నాటకాలు లేని కాలంలో పూర్తి రామకథను నాటకంగా రచించిన ఈ కవి అసాధారణమైన ప్రతిభ కలవా డుగా కీర్తి గడించాడు. భవభూతి మహాకవి రచించిన ‘మహావీర చరితము’, ‘ఉత్తర రామ చరితము’ కలిస్తే అది సంపూర్ణమైన రామకథ అవుతుంది.

కానీ, మురారి మొత్తం కథను ఒకే నాటకంగా రచించి దానికొక విశిష్టతను తన పాండితీబలంతో తెచ్చిపెట్టాడు. ‘మురారేః తృతీయః పంథా’ అన్న ఒక ప్రత్యేకతను సాధించుకున్న కవి. ఆయన రచనను అనువదించ గలిగిన ప్రతిభ కలిగిన కవి బిజ్జుల తిమ్మభూపాలుడు. ఆంధ్ర కవి తరంగిణీ కారుడైన కీ.శే. చాగంటి శేషయ్య “మురారి విజ్ఞానానికి కొరత రాని విధంగా తిమ్మన అనర్ఘ రాఘవ క్యావ రచన సాగింది” అని చెప్పాడు. దీనినిబట్టి ఆ కవి ప్రతిభ అర్థమవుతున్నది.

గొప్ప కవితా రీతులు

నాటకం కావ్యరూపంలోకి అనువదితమైన ఈ కృత్యవతారికలో తిమ్మన కవి పూర్వకవి స్తుతితోబాటు తమ వంశంలో తమ పూర్వులైన పెద్దల ఘనతనూ విపులంగా చెప్పాడు. బిజ్జుల వంశమూల పురుషుడైన దాద భూపాలుడు, చెన్న నరపతి, చిన తిమ్మరాజు, కొండ భూపాలుడు, రామ నృపాలుడు, యోగ ప్రభు వు, ఎరగొండు భూపతి, పెద తిమ్మభూపాలుడు, కృష్ణ భూపతి మొదలైన వారి విశేషా లన్నీ వర్ణించాడు.

నాటి అలంపూరు సీమకు చెందిన కర్నూలులోని ‘కొండారెడ్డి బురుజు’ను నిర్మించిన కొండ భూపాలునితోపాటు ఇతర పాలకుల పరాక్రమాలను, పాలనా విశేషాలను గొప్ప కవితారీతిలో వర్ణించడం ఈ అవతారికలోని విశేషం. నాటి వనపర్తి సంస్థానాధీశుడైన జనుంపల్లి వెంకటరాజు కుమార్తె బచ్చమాంబను తన మాతృమూర్తిగా చెప్పా డు. ఆమెను వివాహం చేసుకున్న కృష్ణ భూప తి దంపతులకు తాను జన్మించినట్లు తెలిపా డు. ఈ అవతారిక వల్లనే ఈ కవి మేనమామ వనపర్తి సంస్థానానికి చెందిన జనుంపల్లి బహరి గోపాలరావుగా చారిత్రకులు గుర్తించారు. ఆయన ‘అష్టభాష’లలో పండితుడు.

“...అమరులను బ్రోచు మహిమచే నమరువాడు

ప్రాకటూరి పురీశుడై ప్రబలువాడు

శాశ్వతై శ్వర్యకరుడు రామేశ్వరుండు

కరుణ మీఱంగ గలలోన గాననయ్యె”

అంటూ కలలో తమ రాజధానీ నగర దైవమైన రామేశ్వర స్వామి కనిపించి

“ఓయనఘ! భవత్కృతాంధ్ర కృతి నాదృతి మాకిపుడంకితంబుగా నొనరించి ధన్యతం బొందు ముర్వర” అని చెప్పిన మాటలనుబట్టి, అప్పటికే కవి తన రచనను ప్రారంభిం చినట్లు భావించవచ్చు. స్వామి వారి ఆదేశానుసారంగా ఈ కావ్యాన్ని ప్రాగటూరు రామేశ్వర స్వామికి సమర్పించి, తొలుత ప్రాగటూరును వర్ణిస్తూ

“చారుకృష్ణా నదీతీర సీమారామ

కమనీయ కల్పక కందళంబు

మహిత లోకత్రయీ మౌళిభాగాభోగ

మండనాయితహోర మణివరంబు

హిమశైల కన్యకావృత్త వక్షోజాత

చిత్రిత చందన పత్రకంబు

ప్రాకటూరీ ధరాపదకమధ్య స్ఫుర

న్నవ్య ముక్తాఫల నాయకంబు

నైన రామేశ్వర స్వామి యనుపమోత్స

వైక సంరంభమునకు నేడిదె సమస్త

దేశ విద్వత్కవి ప్రభృతి ప్రశస్త

ఘన సభాజన మిచ్చోట దనరె నౌర!”

అంటూ ఆ స్వామి వైభవాన్ని కీర్తిస్తూనే అక్కడికి సమస్త దేశవిద్వత్కువులు రావడాన్ని కూడా ప్రస్తావించాడు తిమ్మభూపాలుడు. అంతేగాక, తను ఈ సందర్భంలోనే ఆస్థాన కవియైన కృష్ణకవిని కూడా పేర్కొనడమేగాక తనకు ఈ కావ్యరచనా సందర్భంలో చేసిన సాయాన్ని కూడా స్మరించాడు బిజ్జుల తిమ్మభూపాలుడు.

రాజకవులకు తప్పని అపప్రథలు

తిమ్మ భూపాలుడు స్మరించుకున్న కృష్ణకవి ‘పేరకవి’ పౌత్రుడని పేర్కొన్నాడు. “నిస్సమ సారస్వత నిర్మలామృత ఝరీ జాగ్రత్త రంగాబ్ది పేర మహాసత్కవి.. ” అంటూ ఆ పేరకవి ప్రతిభను ప్రశింసించాడు. తనకు తన కావ్య నిర్మా ణంలో సహకరించిన పేరకవి పౌత్రుడు, తన ఆస్థాన కవి అయిన కృష్ణకవిని గురించి

“అతనికి పౌత్రుడై యసదృశాఖిల 

విద్యల ప్రౌఢిగన్న యా

యతమతి కృష్ణ సత్కవి సహాయ 

కవిత్వమునన్ సమాజ సం

తత భజనాదరుండునగు నాకు 

నశేష విశేష వైదుషీ

ప్రతిభ కరస్థలామలక భాస్వరమై 

తనరారుట బ్రమే” అని కొనియాడారు.

అంతటి ప్రతిభామూర్తి సాయంతోనే ఇంత టి గొప్ప కావ్యాన్ని తిమ్మ భూపాలుడు రచింపగలిగాడు. ఈయన రాజకవి కనుక ‘కృష్ణకవి యే ఈ కావ్యాన్ని రచించి తమ రాజు పేరు పెట్టాడన్న ఒక అపప్రథ కూడా లోకంలో ప్రచారంలో ఉంది. రాజులు కవులైతే ఈ అపప్రథలు తప్పవేమో. అంతటి సాహితీ సమ రాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణ దేవరాయలకే ఈ అపప్రథ తప్పలేదు కదా! లోకం తీరు ఈ విధంగానే ఉంటుందేమో. 

తిమ్మరాజే స్వయంగా

“..బాల వాల్మీకి బిరుద శుంభన్మురారి

నాటక మనర్ఘ రాఘవ నామకంబు

దాని నాంధ్ర ప్రబంధంబుగా నొనర్చి

యుదిత సామగ్రి సమ్మద మూన్తు సభకు”

అంటే లోక సమ్మతంగా అత్యంత ప్రతిభాశాలియైన మురారికృత ‘అనర్ఘ రాఘవ’ నాట కాన్ని తెలుగు మహా ప్రబంధంగా తీర్చిదిద్దుతానని చెప్పుకున్నా కూడా ఇది కృష్ణకవి విరచిత మన్న ప్రచారం విడ్డూరమైన విషయమే. మన వాళ్లు ఇటువంటి ప్రచారాలు చేసి రాజకవుల విషయంలో కొంత అన్యాయం చేశారేమో అనిపిస్తుంది. ‘ఆముక్త మాల్యద’ రచనా పద్ధతిలో, ‘మనుచరిత్ర’ రచనా పద్ధతిలో హస్తిమశ కాంతమైన తేడా స్పష్టంగా కనిపించినా కూడా తమ వాదాన్ని వినిపించి తప్పుడు మార్గంలో సాహిత్యాన్ని నడిపించే ప్రయత్నం చేశారు.

దక్షిణ కాశీక్షేత్రంగా అలంపుర వర్ణన

బిజ్జుల తిమ్మభూపతి పరిపాలించిన ప్రాం తం అలంపూరు సీమ. అలంపురం జోగుళాం బ కొలువైన శక్తి పీఠం ఇది. అక్కడి ప్రధాన దై వం శ్రీబాల బ్రహ్మేశ్వర స్వామి. ‘బ్రహ్మేశో యం నవిశ్వేశః సాకాశీ హేమలాపురీ, సాగం గా తుంగ భద్రేయం, సత్యమేతన్నసంశయః’ అన్న స్కాంద పురాణాంతర్గత సాక్ష్యాలనుబట్టి దీనిని దక్షిణ కాశీ క్షేత్రమన్న కీర్తి దక్కింది. ఆ విషయాన్నే కవి

“కమనీయ దక్షిణ కాశిక్షేత్రంబు

రహిమించ నెవ్వాని రాజధాని

తుంగాఖ్యగంగా తరంగరంగన్మౌళి

బ్రహ్మేశుడెవ్వాని పాలివేల్పు

పాదుషాదత్త శుంభద్దంతి హయముఖ్య

వస్తులెవ్వని యింట విస్తరిల్లు

ధరవంతుకెక్కు కందనవోలి దేశంబు

గణుతింప నెవ్వాని కాణయాచి

సిరులనొప్పు నలంపురీ సీమకెల్ల

నాడగౌడును, దేశాయి నాడకరణ

మనెడు విఖ్యాతి యెవ్వాని కలరెనతడు

నతడు వొల్చె బిజ్జుల తిమ్మభూవిభుండు”

అంటూ ఈ సీమప్రాశస్త్యాన్ని ప్రాగటూరితోపాటు బ్రహ్మేశ్వర క్షేత్రమైన అలంపూరును కూడా రాజధానిగా చేసికొని కర్నూలు (కందనవోలు) ప్రాంతాన్ని సైతం ఈ వంశీయులే పాలించినట్టు తెలుస్తున్నది. ఇటువంటి తిమ్మ భూపాలుడు అతి ప్రశస్తిగాంచిన మురారి సం స్కృత నాటకాన్ని పద్య కావ్యంగా అనువదించిన ప్రతిభాశాలి. తన రచనలో అద్భుతమైన పద్యరత్నాలను పాఠకులకు అందించి రామచంద్రుని కృపకు పాత్రుడైనాడు.

వాల్మీకి మాటల్లోని భావ పరిమళం

విశ్వామిత్రుని యాగ సంరక్షణానంతరం రామలక్ష్మణులు మిథిలకు చేరిన పిదప వారి సౌందర్య గరిమను చూసిన వారి ఆశ్చర్యాన్ని మనకు కూడా కలిగించే విధంగా వర్ణించిన విధానం అద్భుతం.

“మొలక నవ్వుల చాయవెలయు వెన్నెలగాయ

దులకించు మోము చందురల చేత

శ్రీకారముల జాడ జెలగు వీనులతోడ

గలసి వర్తిలు కన్నుగవల చేత

జిగిగుల్కు నెనలేని చిఱుత కూకటులూని

యలరు నిద్దపు టౌదలల చేత

పటుతరోన్నత బొల్చు బలితంపు విలుదాల్చు

కమనీయ బాహుదండముల చేత

తళుకుగల జాళువాజన్నిదముల చేత

బొలచి కంతు జయంతుల గెలుచునట్టి

రాచకొమరుల చెలువంబు జూచిరేని

బురుషులకునైన మోహంబు పొడమకున్నె”

అన్న ఈ పద్యం చదివితే వాల్మీకి మహర్షి చెప్పిన ‘పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ’ అన్న వాక్యం స్ఫురిస్తుంది. అయితే, వాల్మీకి కేవలం శ్రీరామచంద్రుణ్ణి మాత్రమే ఉద్దేశించి పలికిన ఈ మాటల సారాంశాన్ని ఈ కవి ఇద్దరు ‘రాచకొమరులకు’ అన్వయింపజేశాడు. రాముని సీతాదేవికి భర్తగా చేస్తానం టూ విదేహరాజైన జనకుడు మాట్లాడుతూ

“సీత రఘురామ గుణమణి క్రీతయయ్యె

నన్వయాచార సరణి నేననఘ! యింక

లక్ష్మణునకిత్తు నూర్మిళా పక్ష్మలాక్షి

ననిన దరహాసమెసగ నమ్ముని వరుండు”

అన్న మాటల్లో ‘ఇయం సీతామమ సుతా సహధర్మ చరీతవ’ అనే వాల్మీకి మాటల్లోని భావ పరిమళం గుబాళిస్తున్నది. ఈ కావ్యంలో తిమ్మ భూపతి ‘అనర్ఘ రాఘవ’ కర్తయైన మురారితో పాటుమహాకవి వాల్మీకిని కూడా దర్శింపజేసినట్లు కీ.శే. కేశవపంతుల నరసింహశాస్త్రి వంటి పండితులు వెలిబుచ్చిన అభిప్రాయం సత్యదూరం కాదు.

అలంపూరును ఏలిన గొప్ప పాలకులు

అలంపూరు సీమను ఏలిన బిజ్జుల వంశీయులు ‘నాడగౌడ’, ‘గాయగోపాల గేయాధిరాయ’ ‘ఖడ్గ నారాయణ’ వంటి అనేక బిరుదులు పొందిన పాలకులు. గొప్ప దానకర్ణులుగా, కవి పండిత పోషకులుగా కూడా ప్రసిద్ధులు. కృష్ణా నదీతీర గ్రామమైన ప్రాగటూరును రాజధానిగా చేసుకుని పరిపాలన చేసిన ఈ రాజులు ఆ పట్టణంలో వెలసిన రామేశ్వరస్వామి తిరునాళ్ల సందర్భంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా విద్వద్గోష్ఠులు, పండిత సత్కారాలను కూడా ఘనంగా నిర్వహించే వారు. ఇటువంటి అనేక వివరాలు ఈ బిజ్జుల తిమ్మభూపాలుడు రచించిన తెలుగు కావ్యం ‘అనర్ఘ రాఘవం’ అవతారికలో వివరంగా ఉన్నాయి.

-గన్నమరాజు గిరిజా మనోహరబాబు

9949013448