- అలాంటి విధానం ప్రభుత్వం వద్ద లేనేలేదు
- నితీశ్‌కుమార్ ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం
న్యూఢిల్లీ, జూలై 22: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఆశలపై కేంద్రప్రభుత్వం నీళ్లు చల్లింది. బీహార్‌కు ప్రత్యేక హోదా సాధించాలన్న ప్రధాన లక్ష్యంతో ఎన్డీయేలో చేరి, మోదీ మూడోసారి ప్రధాని కావటంలో కీలక పాత్ర పోషించిన నితీశ్‌కు.. కేంద్రప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా సోమవారం చేతువార్త చెప్పింది. బీహార్‌కు ప్రత్యేక హోదీ ఇచ్చే ఆలోచన ఏదీ లేదని కుండబద్ధలు కొట్టింది.
లోక్‌సభలో సోమవారం బీహార్‌కు ప్రత్యేక హోదాపై జేడీయూ ఎంపీ రామ్‌ప్రీత్ మండల్ ప్రశ్న అడిగారు. ‘బీహార్‌తోపాటు ఇతర వెనుకబడిన రాష్ట్రాల్లో ఆర్థిక వృద్ధి, పారిశ్రామికీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన ఏమైనా ఉన్నదా?’ అని ఆయన ప్రశ్నించారు. అందుకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు’ అని సూటిగా చెప్పారు. కేంద్రం ప్రకటనపై బీహార్‌లో ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ విమర్శలు గుప్పించింది.‘నితీశ్‌కుమార్, జేడీయూ నేతలు కేంద్రంలో అధికారాన్ని అనుభవించండి. అధికార ఫలాలు పొందండి.. బీహార్‌లో మాత్రం ప్రత్యేక హోదాపై నాటకాలు కొనసాగించండి’ అని దుయ్యబట్టింది.
ఆత్మరక్షణలో జేడీయూ
కేంద్రం ప్రకటన తర్వాత జేడీయూ నేతలు ఆత్మరక్షణలో పడి ప్రత్యేక హోదా లేకుంటే ప్రత్యేక ప్యాకేజీ అయినా ఇవ్వాలని కోరటం గమనార్హం. జేడీయూ ఎంపీ సంజయ్‌కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. మా పార్టీ మొదటి నుంచీ ఇదే డిమాండ్ చేస్తున్నది. ప్రత్యేక హోదా కోసం సీఎం నితీశ్‌కుమార్ భారీ ర్యాలీలు కూడా తీశారు. ప్రత్యేక హోదా ఇవ్వటంలో కేంద్రానికి ఏదైనా సమస్య ఉంటే కనీసం ప్రత్యేక ప్యాకేజీ అయినా ఇవ్వాలి’ అని మొరపెట్టుకొన్నారు. 2014-15 మధ్య 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉండేది.
మోదీ ప్రభుత్వం రాగానే ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి 2014లో నీతి ఆయోగ్‌ను తీసుకురావటంతో ప్రత్యేక హోదాలన్నీ రద్దయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన మోదీ ప్రభుత్వం దానిని పక్కన పెట్టింది. ప్రస్తుతం మోదీ సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా చేరి, మళ్లీ ప్రత్యేక హోదా సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నది. బీహార్ విషయంలో కేంద్రం ప్రకటనతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రణాళికలు కూడా ప్రభావితం అయ్యేలా ఉన్నాయి.