తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గాడిద గుడ్డు
- పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
- నేడు నిరసనలు వ్యక్తం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ బీహర్ ఎన్నికల బడ్జెట్‌లాగా ఉందని, ఎన్నికల కోసమే బీహార్‌కు నజరనాలు ఇచ్చారని శనివారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. రూ.50.65 లక్షల బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క పైసా కూడా ప్రత్యేక కేటాయింపు జరపలేదన్నారు.
రాష్ట్రం నుంచి రూ.40 వేల కోట్ల వరకు జీఎస్టీ ద్వారా కేంద్రానికి వెళ్తున్నాయని, ఆ మేరకైనా కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు రావాలి కదా..? అని మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ తెలుగు కోడలైనా తెలంగాణపై ఏమాత్రం ప్రేమ చూపలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో గురజాడ అప్పారావు రాసిన ‘దేశమంటే మట్టి కాదోయ్..
దేశమంటే మనుషులోయ్..’ అన్న పదాలను వాడారని, మరి తెలంగాణ ప్రజలు దేశంలో మనుషులు కారా..? అని ఆయన నిలదీశారు. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు, వివిధ ప్రాజెక్టుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో పాటు మంత్రులు ఎంపీలు ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేసినా రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలో వివక్ష చూపారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్లే కేంద్రం వివక్ష చూపుతున్నట్టు అర్థమవుతోందన్నారు.
కేంద్ర బడ్జెట్‌కు నిరసనగా నేడు ధర్నా..
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై వివక్షకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం నిరసన వ్యక్తం చేయనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేయనున్నట్లు తెలిపారు.
3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ప్రధాని, ఆర్థిక మంత్రితో పాటు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేయాలని సూచించారు.