calender_icon.png 16 January, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గతం కంటే ఘనంగా బోనాలు

07-07-2024 12:05:00 AM

మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి): తెలంగాణ బోనాల దశాబ్ది ఉత్సవాలను, ఆషాఢ మాసం బోనాలను వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం బేగంపేట హరిత టూరిజం ప్లాజా లో ‘బోనాల దశాబ్ది ఉత్సవాలు 2024’ ఏర్పాట్లకు సంబంధించిన చెక్కులను దేవాలయాల కమిటీలకు పంపిణీ చేయగా.. హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో బోనాలను గతం కంటే ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఉత్సవాల నిర్వహణ కోసం అధికారులు, ఉత్సవ కమిటీలు, పీస్ కమిటీలతో పలు సమావేశాలు నిర్వహించామని చెప్పారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఆషాఢ మాసం బోనాలు ఆగస్టు 4 వరకు జరుగుతాయని తెలిపారు.   

మన సంస్కృతి దేశవ్యాప్తంగా తెలిసేలా..

హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలు దేశవ్యాప్తంగా తెలిసేలా బోనాల ఉత్సవాలను నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేవాదాయ మంత్రి సురేఖ, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీధర్‌బాబుతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు జయప్రదమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం బోనాల ఉత్సవాల క్యాలెండర్, పోస్టర్లు, బోనాల పండుగపై మామిడి హరికృష్ణ రాసిన పుస్తకం, బోనాల పండుగ పాట సీడీని మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు.

కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్య, దేవాదాయ సమాచార శాఖ కమిషనర్ హన్మంతరావు, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, అదనపు కలెక్టర్ వెంకటాచారి, దేవదాయ శాఖ కమిషనర్ దీప్తి , వివిధ దేవాలయాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.