29-03-2025 11:14:44 PM
మిమిక్రీ తో అలరించిన ముక్కు అవినాష్
రాజేంద్రనగర్ (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల 'కాలేజ్ డే' శనివారం ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన 'కాలేజ్ డే' కు బిగ్ బాస్ ఫేం ముక్కు అవినాష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థి వ్యవహారాల డీన్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ ఝాన్సీరాణి, డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ డాక్టర్ ఈశ్వరి, అసోసియేట్ డీన్ గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ గోవర్ధన్, పూర్వ అసోసియేట్ డీన్ డాక్టర్ నరేంద్ర రెడ్డి కళాశాల ఓఎస్ఏ డాక్టర్ ప్రశాంత్ లు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే జీవితంలో మనం అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని అన్నారు. పలువురిని అనుకరిస్తూ మిమిక్రీ చేసి విద్యార్థులను అలరించారు. తాను నటనలో రాణించడానికి పడిన కష్టాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరచుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను, శాస్త్రీయ దృక్పథాన్ని, స్మార్ట్ వర్క్ ని, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు విభాగాలలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అలాగే విద్యార్థులు ప్రదర్శించిన సంస్కృతిక పోటీలు అలరించాయి.