బరిలో 19మంది అభ్యర్థులు
పోలింగ్‌కు కట్టుదిట్టమైన బందోబస్తు
సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం..
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై బీజేపీ అభ్యర్థి ఫిర్యాదు
నాగర్‌కర్నూల్, మే12 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానంలో ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇక్కడ మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులే నువ్వా? నేనా? అనే స్థాయిలో తలపడుతున్నారు. ఏడు నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 17,38,254 మంది కాగా 8,64,875 మంది పురుషులు 8,73,340 మంది స్త్రీలు, 39 మంది ఇతరులు ఉన్నారు.
జిల్లా వ్యాప్తం గా 1,944 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 113 సమస్యాత్మక పోలిం గ్ కేంద్రాలుగా గుర్తించారు. ఇప్పటికే హోమ్ ఓటింగ్ ద్వారా 493 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు అధికారులు తెలిపారు. పోలింగ్ ప్రక్రియలో 14,491 మంది విధుల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. వీరిని ఆయా పోలింగ్ కేంద్రాలను కట్టుదిట్టమైన బందోబస్తు మద్య పోలింగ్ సామాగ్రిని సిబ్బందిని తరలించారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థిపై ఫిర్యాదు
నువ్వానేనా అనే స్థాయిలో ఎన్నికల ఫైట్ జరుగుతున్న తరుణంలో అభ్యర్థులు ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారాలకు దిగుతున్నారు. పాత వీడియోలను మార్ఫింగ్ చేసుకుంటూ వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. రూ.250 కోట్లకు కాంగ్రె స్ అభ్యర్థి మల్లు రవికి బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ అమ్ముడుపోయాడంటూ ఓ పేపరు క్లిప్పింగ్ సోషల్ మీడియాలో స్వేరోస్ పేరు తో వైరల్ అయ్యింది. దీంతో బీఆర్‌ఎస్ అభ్య ర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ అభ్యర్థి భరత్‌ప్రసాద్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
పోలింగ్ సిబ్బంది ఆకలి అవస్థలు
ఆయా పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని పంపిణీ చేసే క్రమంలో పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజన ఏర్పాట్లు నామమాత్రంగా ఉండటంతో సిబ్బంది ఆకలి తీర్చుకు నేందుకు అవస్థలు పడ్డారు. కేవలం రెండు కౌంటర్లు మాత్రమే ఏర్పాటు చేయడంతో చాలా సమయం భోజనం కోసం క్యూలైన్‌లో నిలుచున్నారు. కొందరికి భోజనం కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.