calender_icon.png 27 November, 2024 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నచెరువుకు పెద్దకష్టం

27-09-2024 02:30:02 AM

శిఖంలో భూమి కొని చెరువుకే ఎసరు

సీసీఎల్‌ఏ నుంచి ఆర్డర్ తెచ్చుకున్న కబ్జాదారు

ఆ భూమి తమ పరిధిలోకి వస్తుందంటున్న ఇరిగేషన్ శాఖ

తాజాగా భూమిలో మట్టి పోసేందుకు కబ్జాదారు యత్నం

చేవెళ్ల, సెప్టెంబర్ 2౬: చెరువు శిఖంలో భూమి కొన్న ఓ వ్యక్తి ఏకంగా చెరువుకే ఎసరు పెట్టాడు. అక్కడే చెరువే లేదని, పట్టా ల్యాండని హైకోర్టుకు వెళ్లాడు. అక్కడ కేసు పెండింగ్‌లో ఉండగానే..  సీసీఎల్‌ఏ కోర్టుకు వెళ్లి పట్టా ల్యాండేనని ఆర్డర్ తెచ్చుకున్నాడు. అంతేకాదు మరో వ్యక్తికి అగ్రిమెంట్ చేయగా ఆయన రెండు వారాల కింద మట్టి, కంకర పోసేందుకు యత్నించాడు. కానీ, గ్రామస్తులు అడ్డుకొని వెనక్కి పంపించారు.

మరోవైపు ఇరిగేషన్ శాఖ మాత్రం అది ముమ్మాటికీ చెరువేనని, గ్రామ మ్యాప్, హెచ్‌ఎండీఏ మ్యాప్‌లోనూ నోటిఫై అయి ఉందని తేల్చిచెబుతున్నారు. దీనిపై ఇప్పటికే రెవెన్యూశాఖకు రిపోర్ట్ ఇచ్చామని స్పష్టం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిన్నమంగళారం గ్రామంలోని సర్వే నెంబర్లు 132,133,134 పరిధిలోని 23 ఎకరాల్లో చిన్నచెరువు విస్తరించి ఉంది. ఈ చెరువు శిఖంలో కొందరు రైతులకు పట్టాలు ఉన్నాయి. వీరిలో వెంకట్ రెడ్డితో పాటు మరో ఏడుగురి నుంచి 1994లో మహ్మద్ అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి 133 సర్వే నెంబర్‌లో 10.18 ఎకరాలు, 134 సర్వే నెంబర్‌లో 6.26 ఎకరాలు కొన్నాడు.

2009లో జీపీ పర్మిషన్‌తో ఓ బిల్డింగ్ సైతం నిర్మించాడు. కాగా, ఈ సర్వే నెంబర్లు చిన్నచెరువు శిఖం ల్యాండ్ అని ఇరిగేషన్ అధికారులు నోటిఫై చేయడంతో ఇరిగేషన్ ఎస్‌ఈ, తహసీల్దార్, జీపీ సెక్రటరీని పార్టీ చేస్తూ 2011లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. ఖాస్రా (1954 నుంచి 2016 వరకు వరకు పట్టా ల్యాండ్‌గా ఉందని, తాను కొన్న సమయంలో అప్పటి తహసీల్దార్ ప్రొసీడింగ్స్ కూడా అలానే ఇచ్చారని విన్నవించాడు. పరిశీలించిన కోర్టు కేసు డిస్పోజ్ చేసి మూడు నెలల్లో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.  

రైతులపై కేసులు..

అబ్దుల్ మజీద్  అనే వ్యక్తి ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్, డీఈ, ఈఈ, కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌తో పాటు సీపీ, ఎస్‌హెచ్‌వోను పార్టీ చేస్తూ 2015లో మరోసారి కోర్టుకు వెళ్లాడు. ఈ సమయంలో అతడు ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించగా వారంతా అడ్డుకున్నారనేది అభియోగం. 10 మంది రైతులపైనా భూమి విషయంలో కేసులు పెట్టినట్లు తెలిసింది. అందుకే సీపీ, ఎస్‌హెచ్‌వోను కూడా ప్రతివాదులుగా చేర్చాడని సమాచారం. ఆ తర్వాత కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌ను ప్రతివాదులుగా చేరుస్తూ 2017లో మరోసారి కోర్టుకు వెళ్లగా.. స్టేటస్ కో ఇచ్చింది. ఈ రెండు కేసులు పెండింగ్‌లో ఉండగానే 2023లో సీసీఎల్‌ఏ కోర్టుకు వెళ్లాడు.

1962 పహాణీ కాలం నంబర్ 2లో మాత్రం శిఖం తలాబ్ పట్టాగా ఉందని, వాస్తవానికి అక్కడ లొకేషన్, సర్వే నెంబర్ ఉండాలని, నేచర్ ఆఫ్ ల్యాండ్  కాదని విన్నవించాడు. 2018 ధరణి వచ్చిన తర్వాతే శిఖం భూమిగా కొత్త పాస్ బుక్కులు జారీ చేశారని తెలిపాడు. పరిశీలించిన సీసీఎల్‌ఏ కమిషనర్ ధరణిలో శిఖం భూమిని పట్టాగా మార్చాలని ఆర్డర్ జారీ చేశారు. కాగా, 2013, 2016లో అది శిఖం భూమేనని అప్పటి తహసీల్దార్ రిపోర్ట్ ఇచ్చినా, 2014లో అది పట్టా ల్యాండ్ అయినప్పటికీ చిన్నచెరువు సదరు సర్వే నంబర్లను కవర్ చేస్తోందని, 1974 పహాణీలో శిఖం తలాబ్ పట్టా అని ఉందని ఆర్డీవో రిపోర్ట్ చేసినా పక్కన పెట్టినట్లు ఆరోపణలున్నాయి. 

చెరువేనని ఇరిగేషన్ శాఖ రిపోర్ట్..

132, 133, 134 సర్వే నెంబర్లలో 23 ఎకరాల్లో చెరువు ఉందని 2005లోనే పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ నుంచి జీవో నంబర్ 216 ద్వారా తమకు చెరువు బదిలీ అయిందని ఇరిగేషన్ అధికారులు వెల్లడిస్తున్నారు. దీనిపై ఇప్పటికే సర్వే చేయించి ప్రభుత్వానికి రిపోర్ట్ సైతం ఇచ్చామని, 2016లో హెచ్‌ఎండీ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిందని వెల్లడిస్తున్నారు. 

మట్టి పోసేందుకు యత్నం..

మహ్మద్ అబ్దుల్ మజీద్ నుంచి శ్రీరామ్‌రెడ్డి అనే వ్యక్తి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత రేట్ విషయం కొలిక్కి రాకపోవడంతో ఇద్దరు కోర్టుకు వెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ భూమి కబ్జా చేసిన వ్యక్తి ఫెన్సింగ్‌తో పాటు షెడ్డు వేశాడు. రెండు వారాల కింద  శిఖంలో కంకర, మట్టి పోసేందుకు యత్నించాడు. కానీ, గ్రామస్తులు అడ్డుకొని వెనక్కి పంపించారు. కాగా, శ్రీరామ్‌రెడ్డి 17.04 ఎకరాల భూమిలో ౪ ఎకరాలు వదిలేసి, మిగితా దాంట్లో మట్టి పోసుకుంటానని చెబుతున్నాడని, ఇందుకు అంగీకరిస్తే గ్రామంలో రోడ్లు,  లైట్లు పెట్టిస్తానని, సైక్లింగ్ ఏర్పాటు చేయిస్తానని హామీలు కూడా ఇచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే అందుకు తాము అంగీకరించ లేదని గ్రామస్తులు చెప్తున్నారు. ఇతడితో కాకుండా మరో వ్యక్తి కూడా 132 సర్వే నెంబర్లో మూడెకరాలకుపైగా చుట్టూ ఫెన్సింగ్ వేసి పరదా ఏర్పాటు చేయడం గమనార్హం.  

చెరువును కాపాడాలి

గ్రామంలో భూగర్భజలాలకు చిన్న చెరువే అధారం. గతంలో చెరువు కింద పంటలు కూడా పండేవి. శిఖం భూముల్లో మట్టి పోసి ప్లాట్లు చేయాలని రియల్టర్లు చూస్తున్నరు. వారం కిందే మట్టి పోసేందుకు యత్నిస్తే అడ్డుకున్నం. ప్రభుత్వం స్పందించి చెరువులోని బిల్డింగ్, షెడ్డును తొలగించాలి. అలాగే ఫెన్సింగ్ తీసేయాలి.

 రాములు, చిన్నమంగళారం, 

మొయినాబాద్ మండలం

చర్యలు తీసుకుంటాం

చిన్నచెరువును కాపాడాలని గ్రామస్తులు గతంలోనే అధికారులకు వినతి పత్రాలు అందించారు. ఇరిగేషన్‌శాఖ శాఖ ఇచ్చిన రిపోర్ట్‌ను ఇప్పటికే పరిశీలించినం. ఈ విషయంలో న్యాయపరమైన సాంకేతిక ఇబ్బందులున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకెళ్తాం. గ్రామస్తులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటాం.  

 గౌతమ్, తహసీల్దార్,

మొయినాబాద్ మండలం