మనుషుల్లో పెద్దతనం వయసులోనో, అనుభవంలోనో, హోదాలు, పదవులు, సంపదల్లోనో వుం టే సరిపోతుందా? పెద్ద మనసు లేకుండా ఇంకెన్ని వుంటేనేమి! అదృష్టవశాత్తు నా జీవితంలో నాకెదురైన నూటికి తొంభై తొమ్మిది మంది పెద్దవాళ్లు విలువైన తమ పెద్దతనానికి వన్నె తెచ్చిన వారే. అలాంటి వారి గురించి ఎంత చెప్పి నా తక్కువే.
ఇరువురు మహానుభావులు (జి.వి.సుబ్రహ్మణ్యం, తిరుమల శ్రీనివాసాచార్య) ఒక సారి ప్రదర్శించిన ఉత్తమ లక్షణం నేనెప్పటికీ మరిచిపోలేనిది. అది కొందరికి చాలా చిన్న పనిలానే అనిపించవచ్చు. కానీ, వారిలోని పెద్ద మనసులను ఎంతో గొప్పగా తెలియజేసింది.
ఆనాటి ‘యువభారతి’ సాహిత్య సంస్థ కు వెన్నెముకగా నిలిచిన వారు దివాకర్ల వేంకటావధాని. అనర్గళంగా, ఆకర్షణీయంగా, ఔచితీ శోభితంగా ప్రసంగించడం ద్వారా ఆయన శ్రోతలందరినీ ఆకట్టుకునేవారు. వారి ఉపన్యాసాలకు అప్పట్లో సం స్థ అధిక ప్రాధాన్యం ఇచ్చేది. అందుకు ఆనాటి ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ మంచి వేదిక అయింది.
ప్రాచీన కావ్యాలమీద వరుసగా దివాకర్ల వారు ఉపన్యాసాలిచ్చారు. సంస్కృత పంచకావ్యాలకు ధీటైన తెలుగు పంచకావ్యాల మీద మాట్లాడితే దివాకర్ల వారే మాట్లాడాలనిపించేంతగా గొప్పగా ఉండేవి. ‘లహరు’ల పేరుతో ఆ సంస్థ ద్వారా ఏర్పాటైన వారి ప్రసంగాలు పుస్తక రూపంలోకి రావడమూ విశేషమే.
అది 1973 నాటి కాలం. వరుసగా ఐదు రోజులు తెలుగు పంచకావ్యాల మీద ప్రసంగాలు ఏర్పాటయ్యాయి. ఆ రోజు వారు మాట్లాడుతారనగా సాహితీ ప్రియులతో పరిషత్తు ప్రాంగణమంతా నిండిపోయింది. సాయంత్రం 6 గంటలకు ప్రసంగం ఆరంభమవుతుందనగా, 5 గంటలకే హాలు నిండిపోయింది. ఆహుతులు కూర్చోవడానికి బయట డేరాలు వేసి కుర్చీలు అమర్చారు నిర్వాహకులు.
నేను పరిషత్తు ప్రాచ్య కళాశాల విద్యార్థిని. నాకు దివాకర్ల వారి ప్రతీ ప్రసంగాన్ని వినే అదృష్టం కలిగింది. మా ప్రాచ్య విద్యార్థులకు వారి ప్రసంగాలు ఎంతో ఇష్టమైనవే కావు, అవశ్యకమైనవి కూడా. మేం కొంతమంది విద్యార్థులం నోటు బుక్కులు తెచ్చుకుని, ఆచార్యుల వారి ప్రసంగ విశేషాలను నోట్ చేసుకునే వాళ్లం.
ఏ రోజు దివాకర్ల వారి ఉపన్యాసం ఉంటుందో ఆ రోజు మాకు క్లాసులు ఉండేవి కావు. సాయం కళాశాల కాబట్టి, తరగతి గదిలో వినడానికి బదులుగా పరిషత్ ప్రాంగణంలో కూర్చుని, వినే అవకాశం విద్యార్థు లకు లభించేది. ఆ రోజు తెలుగు ప్రబంధ వృక్షానికి పూచిన తొలి కుసుమరాజం ‘మనుచరిత్ర’ మీద దివాకర్ల వారి ప్రసంగం. ఇంకేం, శ్రోతలకు కొదువా!
దురదృష్టం కొద్దీ నేను కొంచెం ఆలస్యంగా పరిషత్తుకు చేరుకున్నాను. కానీ, అ ప్పటికే హాలుతోపాటు ప్రాంగణం పూర్తి గా ఆహుతులతో నిండిపోయింది. నాకు కూర్చోవడానికి ఒక్క కుర్చీ కూడా మిగలలేదు. దివాకర్ల వారు ‘ఎవ్వతె వీవు భీతహ రిణేక్షణ..’ (ప్రవరుడు), ‘ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు..’ (వరూధిని) మాటలను పద్యరూపంలో ముగ్ధ మనోహరంగా వివరిస్తున్నారు. ఒక్కమాటలో చె ప్పాలంటే ప్రేక్షకులు దివాకర్ల వారి ఉపన్యాసానికి చెవులు అప్పగించి, శృంగార రసప్రవాహంలో మునిగిపోయారు.
ఎవరూ ఎవరినీ చూసే అవకాశమే లే దు. ఎవరూ ఎవరితో మాట్లాడే పరిస్థితి అ స్సలు లేదు. సరదాకు సినిమాలకు వెళ్లే వారుండవచ్చుగాని, అప్పట్లో ‘యువభారతి’ ఉపన్యాసాలకు మాత్రం అత్యంత చి త్తశుద్ధితో సాహితీ రసాస్వాదన చేయగలిగిన శ్రోతలే అత్యధికంగా ఉండడం విశేషం.
నాకు కూర్చుందామంటే కుర్చీ లేదు కనుక, నిలబడే వింటున్నాను. నాకు తెలియకుండానే నేను ‘మనుచరిత్ర’లోని ఘట్టాలలో మునిగి ఉన్నాను. నేను నిలబడిన సంగతి కూడా మరిచిపోయాను. ఆ సమయంలోనే అనుకోని ఒక విచిత్రం జరిగింది.
ఎవరోగాని నేను నిలబడ్డచోట ఒక కు ర్చీ వేశారు. నేను అసంకల్పితంగానే ఆ కు ర్చీలో కూర్చున్నాను. ఆ కుర్చీ ఎవరు వేశా రో గమనించే స్థితిలో కూడా నేను లేను. అంతగా లీనమై ఉన్నాను. శ్రోతలందరి ప రిస్థితీ దాదాపు ఇంతే. అలా ఒక గంటసే పు హాయిగా కూర్చొని దివాకర్ల వారి ఉపన్యాస ధారలోని గొప్పతనాన్ని ఆస్వాదిం చాను. ఒక విధంగా పరిసరాలను మరిచి పరవశించి పోయాను.
ఇక, దివాకర్ల వారి ఉపన్యాసం ముగింపునకు వస్తున్న విష యం నా ఎరుకకు రాగానే, నేను కుర్చీలోంచి లేచి, అనుకోకుండా వెనక్కి చూశా ను. నమ్మశక్యం కానంతగా నాకు ఆశ్చర్యం వేసింది. నా వెనుక నిలబడి ఉన్న వారెవరో కాదు, ఇరువురు ఆచార్యులు జి.వి. సుబ్రహ్మణ్యం, వారి పక్కన తిరుమల శ్రీనివాసాచాచార్యులు. ఇద్దరూ నిలబడే ఉన్నారు.
నిజానికి వారిద్దరిలో ఎవరో ఒకరు తాము కూర్చున్న కుర్చీని నాకు వేశారని అర్థమైంది. వారిని నిలబెట్టి, అప్పటికి నిలబడ్డ నేను కుర్చీలో కూర్చొని ప్రసంగం విన్నానన్నమాట.
వ్యక్తుల వల్లే సంస్థలకు గౌరవం
ఆ ఇరువురు మహానుభావుల దగ్గరికి వెళ్లి నేను చేతులు జోడించి వినమ్రంగా న మస్కరించాను. ‘ఒక సంస్థను నడిపే వా రంటే ఇలా ఉండాలన్న’ ఆలోచన నాకు అప్పుడే కలిగింది. అతిథుల్ని ఆహ్వానించి న వారు తామే ముందుగా భోజనానికి కూర్చుంటే ఎలా ఉంటుంది? చాలామం ది వ్యక్తులు, సంస్థల నిర్వహణ వ్యవహారం ఇలాగే ఉంటున్నది. కాని, దానికి భిన్నంగా ‘యువభారతి’ సంస్థను దక్షతతో నడుపుతూ, అందరికీ ఆదర్శమైన నిర్వాహకుల పై నాకు ఎనలేని గౌరవం కలిగింది.
వ్యాసకర్త సెల్: 9885654381