calender_icon.png 20 January, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్‌కూ భారీగానే..

24-07-2024 02:15:35 AM

  • ప్యాకేజీలతో ప్రసన్నం చేసుకునేందుకు యత్నం 
  • సింహభాగం బీహార్‌కే అన్నట్లు ప్రతిపాదనలు 
  • విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లు

న్యూఢిల్లీ, జూలై 23: మంగళవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సింహభాగం నిధులు బీహార్ రాష్ట్రానికే దక్కాయి. ఎన్డీయే కూటమిలో ప్రధానంగా ఉన్న నితీష్ సారధ్యంలోని జేడీయూ ప్రస్తు తం బీహార్‌ను పాలిస్తుంది. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమా ర్ కేంద్రాన్ని డిమాండ్ చేయగా.. ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం తేల్చిచెప్పింది. కానీ 2024 బడ్జెట్‌లో మాత్రం బీహార్ మీద వరాల జల్లు కురిపించింది. రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధి కోసం రూ. 26 వేల కోట్ల ఆర్థిక సాయం అందిస్తామని, రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల కోసమే రూ. 20 వేల కోట్ల మేర కేటాయించనున్నట్లు తెలిపింది. అలాగే బీహార్ రాజధాని పాట్నా కలుపుతూ ఓ ఎక్స్‌ప్రెస్ వేను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది.

అంతే కాకుండా బక్సర్ బోధ్‌గయ అనుసంధానిస్తామని ప్రకటించింది. బక్సర్ జిల్లాలో గంగానదిపై రెండు లైన్ల వంతెన నిర్మించడంతో పాటు భాగల్‌పుర్‌లోని పిర్‌పౌంతీలో 2400 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చింది. ఇకపోతే రూ. 21వేల కోట్లతో వివిధ రకాల పవర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని, పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు గయ, రాజ్‌గిర్‌ల లో టెంపుల్ కారిడార్‌లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. రూ. 11,500 కోట్లతో వరదల నియంత్రణకు పలు నిర్మాణాలు చేపడతామని పేర్కొంది. ఇవి మాత్రమే కాకుండా మరిన్ని అభివృద్ధి పనులు కూడా చేపట్టనున్నట్లు ప్రకటించింది.