calender_icon.png 5 November, 2024 | 11:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిగ్ ఫైట్

05-11-2024 02:28:01 AM

  1. నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు
  2. ప్రచారాన్ని ముగించిన అభ్యర్థులు ట్రంప్, కమల
  3. చివరి దశలో కీలక రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు
  4. అధ్యక్షుడి ఎన్నికను నిర్ణయించనున్న స్వింగ్ రాష్ట్రాలు
  5. ముందస్తు ఓటింగ్‌లో పాల్గొన్న 7.1 కోట్ల మంది

అగ్రరాజ్య ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. అమెరికా కాల మానం ప్రకారం నవంబర్ 5 (మంగళవారం) పోలింగ్ జరగ నుంది. ఇప్పటికే ప్రధాన అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలాహ్యారిస్ తమ ప్రచారాన్ని ముగించారు. ప్రచారం చివరి అంకంలో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ఇద్దరూ తీవ్రంగా ప్రయత్నించారు.

చివరి రోజు నార్త్ కరోలినా రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ విస్తృతంగా పర్యటించగా డెమోక్రటిక్ అభ్యర్థి కమల మాత్రం ఇంటర్వ్యూలకు సమయం కేటాయించారు.  అమెరికాలో 24.4 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇప్పటికే రికార్డు స్థాయిలో 7.1 కోట్ల మంది ముందస్తుగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మెయిల్స్, పోలింగ్ కేంద్రాల ద్వారా ముందస్తు ఓటింగ్‌లో ఈ స్థాయిలో ఓట్లు వేయడం ఇదే తొలిసారి. పోలింగ్ ముగిసిన వెంటనే ప్రాథమిక ఫలితాలు వస్తాయి. ఎలక్టోరల్ కాలేజీ ఎన్నిక సహా అన్ని ప్రక్రియలు పూర్తయి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరగాలంటే  జనవరి 20 వరకు ఆగాల్సిందే. 


నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు

  1. ప్రచారాన్ని ముగించిన అభ్యర్థులు ట్రంప్, కమల
  2. చివరి దశలో కీలక రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు
  3. అధ్యక్షుడిని నిర్ణయించనున్న స్వింగ్ రాష్ట్రాలు
  4. ముందస్తు ఓటింగ్‌లో పాల్గొన్న 7.1 కోట్ల మంది
  5. ఒపీనియన్ పోల్స్‌లో కమలదే ముందంజ

వాషింగ్టన్, నవంబర్ 4: ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న అమెరి కా అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని గంటల్లోనే ప్రారంభమవనున్నాయి. ఎన్నికల ప్రక్రియ కు ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పోలింగ్ జరగనుంది.

మంగళవారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిపబ్లికన్, డెమోక్రటిక్ అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలహ్యారిస్ తమ ప్రచారాన్ని ముగించారు. ప్రచారం చివరి అంకంలో స్వింగ్ స్టేట్లపై ట్రంప్, కమల దృష్టిసారించారు. ట్రంప్ నార్త్ కరోలినా, విస్కాన్సిన్‌లో పర్యటించగా కమల విస్కాన్సిన్, జార్జియాతో పాటు మిషిగన్‌లో ప్రచారం నిర్వహించారు.  

ముందస్తు ఓటింగ్‌లో రికార్డు

అమెరికాలో ఎప్పుడూ లేనంతగా ముం దస్తు ఓటింగ్ భారీ స్థాయిలో జరిగింది. ఇప్పటివరకు 7.1 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెయి ల్స్, పోలింగ్ కేంద్రాల ద్వారా వీరంతా ఓట్లు వేశారు. కీలకంగా భావిస్తున్న నార్త్ కరోలినాలో ఇప్పటికే 78 లక్షల మంది ఓట్లేశారు.      

అధ్యక్షుడి ఎన్నిక ఇలా.. 

యూఎస్ అధ్యక్ష ఎన్నికకు రాష్ట్రాల్లో పాపులర్ ఎలక్షన్ ఫలితాలు కీలకం. నేరుగా అధ్యక్షునికి కాకుండా రాష్ట్రాల్లోనే ప్రజలు ఓట్లు వేస్తారు. ప్రతి రాష్ట్రంలో జనాభా ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. దీన్నే ఎలక్టోరల్ కాలేజీ అంటారు. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. అధ్యక్ష ఎన్నికల్లో రాష్ట్రాల్లోని ఎలక్టర్లకే ఓట్లు వేసినా అవన్నీ అధ్యక్ష అభ్యర్థిని దృష్టిలో పెట్టుకునే ఉంటాయి.

అయితే, అధ్యక్ష ఎన్నికల్లో పాపులర్ ఓట్ల ఫలితాలు ప్రెసిడెంట్‌ను నిర్ణయించవు. ఎలక్టోరల్ కాలేజీలో 270, ఆపైన వచ్చినవారు గెలిచినట్లు లెక్క. ఇలా చూస్తే కాలిఫోర్నియాలో అత్యధికంగా 54, టెక్సాస్ల్ 40 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అత్యల్పంగా వ్యోమింగ్‌లో 3 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. కాగా, ఎలక్టోరల్ కాలేజీకి ఎంపికైన ప్రతినిధులు డిసెంబర్ 17న సమావేశమై అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో ఏ అభ్యర్థికి 270 రాకుంటే ఫలితం టై అవుతుంది. అప్పుడు కంటింజెంట్ ఓటింగ్ నిర్వహిస్తారు. అంటే ప్రతినిధుల సభలోని సభ్యులు తమ ఓటు హక్కు ద్వారా ఇద్దరిలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. వైస్ ప్రెసిడెంట్ విషయంలోనైతే సెనేట్ సభ్యులు ఎన్నుకుంటారు.  

స్వింగ్ రాష్ట్రాలే కీలకం

అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలా వరకు ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం తటస్థంగా వ్యవహరిస్తాయి. ఇవి ఆయా సందర్భాలను బట్టి అభ్యర్థులకు మద్దతు తెలుపుతాయి. వీటినే స్వింగ్ స్టేట్స్‌గా పరిగణిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెన్సిల్వేనియా, ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 93 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లే అధ్యక్ష పీఠాన్ని నిర్ణయించే అవకాశం ఉండటంతో ఈ రాష్ట్రాల్లో పట్టు కోసం హ్యారిస్, ట్రంప్ పోటాపోటీగా ప్రయత్నిస్తున్నారు. 

సర్వేల్లో కమలకే ఎక్కువ మద్దతు

డెమోక్రాట్ అభ్యర్థిగా కమల నిలబడినప్పటి నుంచి ఆమెకే పోల్ సర్వేలు మద్దతు తెలుపుతూ వస్తున్నాయి. కొన్ని సర్వేలు మినహా దాదాపు కమలే అధ్యక్షురాలు అవుతారని చెప్పాయి. కాగా, ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త నేట్ సిల్వర్ అంచనా ప్రకారం హోరాహోరీ పోరులో ట్రంప్ విజయం సాధిస్తారని అంచనా వేశారు.

సిల్వర్ మోడల్ అంచనా ప్రకారం ట్రంప్‌కు ఎలక్టోరల్ కాలేజీలో 51.5 శాతం ఓట్లు లభించే అవకాశముందని చెప్పారు. హ్యారిస్‌కు 48.1 శాతం మంది మొగ్గు చూపుతున్నట్లు పేర్కొన్నారు. అట్లాస్ ఇంటెల్ పోల్స్‌లోనూ ట్రంప్‌కే అధిక మద్దతు ఉంటుందని తేలింది. స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ లీడ్ ఉన్నట్లు వెల్లడించింది.

న్యూయార్క్ టైమ్స్ మాత్రం స్వింగ్ స్టేట్స్ హ్యారిస్‌కు సానుకూలంగా ఉన్నట్లు చెప్పాయి. కానీ అవేమీ అద్భుతంగా లేవని, గట్టి పోటీ తప్పదని తెలిపింది. రిపబ్లికన్లకు మంచి పట్టున్న అయోవాలో ట్రంప్ వెనుకంజలో ఉన్నట్లు సెల్జెర్ సర్వే వెల్లడించింది. 

అప్పుడు వైట్‌హౌస్ వీడాల్సింది కాదు..

2020 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైట్‌హౌస్‌ను వీడాల్సింది కాదనిట్రంప్ వ్యాఖ్యానించారు. పెన్సిల్వేనియాలో ఆదివారం నిర్వహించిన సభలో తాను పదవిని వీడే నాటికి దేశ సరిహద్దులు పటిష్ఠంగా ఉన్నాయి. తాము బాగా పవిచేశామని చెప్పారు. ఈ సారి పోలింగ్‌లో ఎలాంటి తప్పు జరగకుండా ప్రతి పోలింగ్ బూత్ వద్ద వందలకొద్దీ లాయర్లు నిలబడ్డారని తెలిపారు. అయోవాలో కమల ముందంజలో ఉన్నారని పేర్కొన్న సర్వేలపైనా ట్రంప్ విరుచుకుపడ్డారు. ప్రత్యర్థిని పూర్తిగా అణిచివేసేందుకే ఇలాంటి సర్వేలు చేస్తారని ఆరోపించారు. ఇవి చట్టవిరుద్ధమని తాను ఇవన్నీ ఎప్పటికీ పట్టించుకోనని చెప్పారు.   

భారత సంతతి ఓటర్ల ప్రభావమెంత?

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి ఓటర్ల పాత్ర కీలకంగా ఉం టుంది. కొన్ని రాష్ట్రాల్లో వీరి ఓట్లు ఫలితాలను నిర్ణయిస్తాయి. ఈ నేప థ్యంలో అభ్యర్థులు సైతం వీరిని ప్రస న్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా రు. ఎన్నికల విభాగం సైతం భారతీయులకు అనుగుణంగా కొన్ని స్థానా ల్లో భారతీయ భాషల్లో నిబంధనలను ప్రచురిస్తోంది. న్యూయార్క్‌లో బెంగాలీలో బ్యాలెట్‌ను ముద్రించడం గమ నార్హం. బెంగాలీతో పాటు స్పానిష్, చైనీస్, కొరియన్ భాషలను ఉప యోగించారు. 

అంకెల్లో అమెరికా ఎన్నికలు

5 అధ్యక్ష పదవికి ఈ నెల ఐదో తేదీన ఎన్నికలు జరుగబోతున్నాయి. నవంబర్‌లో మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం ఎన్నికలు జరగడం అక్కడ ఆనవాయితీ.

2 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా మంది స్వతంత్య్ర అభ్యర్థులు ఉత్సాహం చూపించారు. కానీ ఎన్నికల సమయం దగ్గర పడేనాటికి ప్రధాన పార్టీలకు చెందిన డొనాల్డ్ ట్రంప్, కమల హ్యారిస్ మధ్య మాత్రమే పోటీ నెలకొంది. మొత్తం అమెరికా కూడా ఈ ఇద్దరి అభ్యర్థులకే మద్దతు తెలుపుతూ రెండుగా విడిపోయింది.

34/435 ఓటర్లు అమెరికా అధ్యక్ష పదవిని ఎవరు చేపట్టాలనేది మాత్రమే నిర్ణయించరు. యూఎస్ కాంగ్రెస్‌లోని 34 సీట్లు గల సెనేట్, 435 సీట్లు గల ప్రతినిధుల సభకు ఎవరు ప్రాతినిథ్యం వహించాలనేది కూడా ఓటర్లే నిర్ణయించనున్నారు. 

7 అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉండగా 7 రాష్ట్రాలు మాత్రమే ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. సాధారణంగా ఈ ఏడు రాష్ట్రాల ప్రజలు ఏ ఒక్క పార్టీకి ప్రత్యేకంగా సపోర్ట్ చేయకుండా న్యూట్రల్‌గా ఉంటారు. ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకుంటారు. ఈ జాబితాలో అరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, పెన్సల్వేనియా,        విస్కాన్సిన్ రాష్ట్రాలు ఉన్నాయి.

24.40 కోట్లు అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో 2024 నాటికి ఓటు హక్కుకు అర్హులైన వారి సంఖ్య 24.40 కోట్లు. 

7,74, 000 ఎన్నికలు సవ్యంగా జరగడంలో పోల్ వర్కర్లు కీలక పాత్ర పోషిస్తారు. అమెరికాలో మొత్తం మూడు రకాల ఎలక్షన్ స్టాఫ్ ఉంటారు. ఇందులో అత్యధికంగా ఉండేది మాత్రం పోల్ వర్కర్లు. 7,74, 000 మంది పోల్ వర్కర్లు ఓటర్లకు స్వాగతం చెప్పడానికి, ఓటింగ్ సామాగ్రిని అమర్చడానికి, ఓటర్ ఐడీలను చెక్ చేయడంతోపాటు ఇతర భాషలతో ఇబ్బందులు పడేవారికి సహాయం చేస్తూ ఎన్నికలు సజావుగా సాగేలా చూస్తారు.