ఇళ్ల ముంగిళ్లలో ఇంద్ర ధనుస్సులు రంగవల్లులై పొడుస్తున్న సంబురం గగనాన బాల్యాలు గాలిపటమై ఎగురుతున్న సంబురం పల్లెసుద్దుల పలుకుబళ్లతో డూ..డూ బసవల విన్యాసపు సంబురం నవధాన్యాలతో నవనవోన్మేషంగా భోగిమంటల భాగ్యాలకు భూమికవుతున్న యువత సయ్యాటల సంబురం కాలగమనంలో కరిగిపోతున్న హరిదాసు ఆటపాటలకు హారతులిస్తూ ... మచ్చుకైనా మెచ్చుకుంటూ..
గుండెగొంతుకై పాదుకునే సంబురం ఏవి అలనాటి కళల ఆనవాళ్లు ఆనందపు ఆకాంక్షల గూళ్ళు అన్నీ మారుతున్నాయ్..మసక బారుతున్నాయ్.. ఐనా కాని అటకెక్కొద్దు పచ్చని పల్లెల్ని వెచ్చగ కప్పుకోవాలి పాడిపంటల్ని ఎదకు హత్తుకోవాలి ఎన్ని రంగుల ఎన్ని హంగుల పెద్ద పండుగొచ్చినా.. భారమవుతున్న బాకీల అంకెల పద్దు కానరాని వెలుగుల పొద్దు పండిన పంటకు ఎక్కడోయి గిట్టుబాటు వండిన వంటలపై ఇంకానా సర్దుబాటు పెద్ద పండుగ ఇప్పుడు పెద్దోళ్ల పండుగై పోతుండే కడు పేదవాడి కడగండ్లు తీరి కాంతులు చిమ్మినప్పుడే సంక్రాంతి!
ఉల్లాసపు సంక్రాంతి
బంతిపూల వైభోగం చేమంతి పూల సోయగం మైమరచే తనూలతల చలిగాలుల సంక్రాంతం వీచిన గాలికి తెలుసు పరిమళాల గంధాలు పండిన పొలానికి తెలుసు తన అందమైన సౌభాగ్యం ముంగిట వేసిన గీతల ముగ్గులసాక్షిగా సంక్రాంతి ప్రతి లోగిలిలో రంగులద్దుకుంటుంది జొన్నపొత్తుల తీపి పాల అంతరంగంలా అల్లుకున్న ప్రేమబంధాల వాహినిలో కదులుతున్న వావివరసల ఆనందహేల గీసిన గీతలు రాసిన రాతలు వేసిన రంగులు.
ఎగిరే పతంగులు గంగిరెద్దులు హరిదాసులు రేగుపండ్లు చెరుకుగడలు ఇలా పండుగశోభ అంతాఇంతా కాదు సకినాలు అరిసెలు అంటేనే సంక్రాంతి పీడలు తొలగించి మేలును కలిగించాలని నవధాన్యాల వాకిళ్లు గొబ్బెమ్మలతో కలిసి సంక్రాంతి పండుగకు స్వాగతం ఇస్తాయి బంతుల తోరణాలు పరికిణీ పిల్లల ఆటలు చిన్నారుల భోగిపండ్లు కన్నవాళ్ళకు సంబరం కొత్తపంటల సిరుల రాకతో ఆనందపు మనవలు, బంధువుల కలయిక ఉల్లాసపు ముచ్చట్లతో ఉత్సాహంగా ఈ మకర సంక్రాంతికి స్వాగతం శుభ స్వాగతం.