calender_icon.png 29 December, 2024 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైడెన్ మరో తడబాటు

13-07-2024 12:09:07 AM

మీడియా ముందే జెలెన్‌స్కీని పుతిన్ పేరుతో ఆహ్వానం

కమలాహారిస్‌కు బదులు ట్రంప్ అంటూ సంబోధన

వాషింగ్టన్ (అమెరికా), జూలై 12: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి మాట్లాడుతూ పొరబడ్డారు. ఏకంగా దేశాధినేతల పేర్లనే మార్చి మాట్లాడారు. నాటో సదస్సు అనంతరం మీడియాతో మాట్లాడిన బైడెన్.. కమలా హారిస్ పేరుకు బదులు అమెరికా ఉపాధ్యకుడు ట్రంప్ అని, జెలెన్‌స్కీకి బదులు ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారాయి. మీడియా సమావేశంలో భాగంగా మీరు తప్పుకుంటే ట్రంప్‌ను కమలాహారిస్ ఓడించే అవకాశముందా? అని పాత్రికేయులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు బదులిస్తూ.. అధ్యక్షుడిగా పనిచేసే అర్హతలు ఉపాధ్యక్షుడు ట్రంప్‌కు లేకుంటే నేను అసలు ఆ పదవికి ఎంపిక చేసేవాణ్నే కాదు అన్నారు.

ఈ మీడియా సమావేశానికి ముందు నాటో సభ్యదేశాల ప్రతినిధులకు జెలెన్‌స్కీని బైడెన్ పరిచయం చేశారు. ఆయనను ప్రశంసిస్తూ ప్రసంగించాలని బైడెన్ కోరారు. ఆ సమయంలో జెలెన్‌స్కీని ఆహ్వానిస్తూ అధ్యక్షుడు పుతిన్ అని సంబోధించారు. దీంతో సమావేశంలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. జెలెన్‌స్కీ మాత్రం నవ్వుతూ తేలిగ్గా తీసుకున్నారు. సమావేశం తర్వాత పలువురు నేతలు సైతం బైడెన్‌కు మద్దతుగా నిలుస్తూ, చిన్న చిన్న పొరపాట్లు సహజమని పేర్కొన్నారు. కానీ, ఈ వ్యాఖ్యలతో ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ఆయనను మరింత ఇబ్బంది పెట్టే అవకాశముంది.