- బీహార్‌కు చెందిన మోస్ట్‌వాంటెడ్ మనీష్‌గా అనుమానిస్తున్న పోలీసులు
- అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల అనంతరం సికింద్రాబాద్, సిద్దిపేట వైపు వెళ్లినట్లు సమాచారం
- పోలీసుల అదుపులో దుండగులు ట్రావెల్ చేసిన ఆటోడ్రైవర్!
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (విజయక్రాంతి): తెలంగాణ, కర్నాటక, చత్తీస్‌ఘడ్, బీహార్ రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న బీహార్ దుండగులు ప్రస్తుతం రెండు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌గా మారారు.
కర్నాటకలోని బీదర్‌లో ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసేందుకు వెళ్తున్న సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపి రూ.93 లక్షల నగదుతో పరారై హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లోనూ కాల్పులకు తెగబడ్డ కేసుకు సంబంధించి హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి నేతృత్వంలో 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలసిందే.
ఈకేసుకు సంబంధించి తాజాగా పోలీసులు పురోగతి సాధించారు. ఇద్దరు దుండగులలో ఒకడిని బీహార్‌కు చెందిన మనీష్‌గా గుర్తించారు. అఫ్జల్‌గంజ్‌లో దాడి అనంతరం ఆ దుండగులు ట్యాంక్‌బండ్ ఆతర్వాత సికింద్రాబాద్ ఆల్ఫాహోటల్ వద్ద ఆటో దిగినట్టుగా గుర్తించారు.
పోలీసుల అదుపులో ఆటో డ్రైవర్..
అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల కంటే ముందు చార్మినార్ ప్రాంతంలో ట్రావెల్ బ్యాగ్స్ కొనుగోలు చేసి అందులో చోరీచేసిన డబ్బును దాచిపెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తునారు. అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల అనంతరం ఆటో ఎక్కి సికింద్రాబాద్‌లో దిగినట్టుగా తెలియడంతో దుండగులు ఎక్కిన ఆటోను గుర్తించి డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
అయితే, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతాలలో బట్టలు కోనుగోలు చేసి తిరుమలగిరి పరిసరాలలోని నిర్మానుష్యమైన ప్రదేశంలో బట్టలు మార్చుకుని.. బ్యాగులను ఛేంజ్ చేసుకుని తిరుమలగిరి నుంచి సుచిత్ర మీదుగా సిద్దిపేట వైపునకు వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
తిరుమలగిరి ప్రాంతంలో బట్టలు, బ్యాగులు మార్చుకున్న సమయంలో చార్మినార్ ప్రాంతంలో కొనుగోలు చేసిన ట్రాలీ బ్యాగులను నిందితులు అక్కడే వదిలేసినట్టుగా, ఆ ట్రాలీ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. అఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్ దాకా ఆటోలో వెళ్లిన సందర్భంలో ఎక్క డికి వెళ్లాలనే విషయంపై ఏమైనా మాట్లాడుకున్నారా..
ఆటోలో కూర్చున్నప్పుడు దొంగలు ఏమేమీ మాట్లాడుకున్నారనే విషయాలపై ఆటో డ్రైవర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. నిందితుల్లో ఒకరైన మనీష్ మరో నిందితుడితో కలిసి దోపిడీలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది.
మనీష్‌పై గతంలోనూ హత్య, దోపిడీ కేసులు ఉండగా, బీహార్ ప్రభుత్వం అతడిని పట్టించేవారికి రివార్డును ప్రకటించింది. ప్రస్తుతం మనీష్ కోసం తెలంగాణ, బీహార్, కర్నాటక, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల పోలీసులు గాలింపు చేపడుతున్నారు.
పక్కా రెక్కీ నిర్వహించే దోపిడీ..
సంగారెడ్డి, జనవరి 18 (విజయక్రాంతి): బీదర్‌లో ఏటీఎంలో డబ్బులు నింపే వాహనం వద్ద దుండగులు పక్కా రెక్కీ నిర్వహించే చోరీకి పాల్పడినటుల బీదర్ పోలీసులు గుర్తించారు. బీదర్ పోలీసులు, సంగారెడ్డి జిల్లా టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులసహకరంతో విచారణ ప్రారంభించారు. దుండగులు బీదర్ కోట నుంచి అస్టూర్ రోడ్డు నుంచి బైపాస్ రోడ్డులో సుల్తాన్‌పూర్, డప్పూర్ నుంచి రాష్ట్రంలోకి వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బీదర్ జిల్లాలోని సుల్తాన్‌పూర్ గ్రామంలోని సీసీ కెమెరాల్లో దుండగులు చోరీ అనంతరం బ్యాగులతో బైక్‌పై పరారవుతున్న ఫోటోలను పోలీసులు గుర్తించారు. గతంలో జరిగిన దోపిడీలతో కూడా వీరికి సంబంధాలున్నాయా అనే కోణంలోనూ విచారణ చేపడుతున్నారు.