అధిక సంఖ్యలో హాజరు కావాలి..
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు..
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని ఐబి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ స్థానంలో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలందరూ పెద్ద మొత్తంలో తరలిరావాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కోరారు. బుధవారం భూమి పూజ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉత్తర తెలంగాణలోనే 650 పడకల సామర్థ్యంతో మంచిర్యాల పట్టణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించుకోవడం అదృష్టం అన్నారు. ఇది నా 60 ఏండ్ల ఆకాంక్ష అని, ఈ ఆసుపత్రి నిర్మాణంతో మంచిర్యాల జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు, మహారాష్ట్రలోని ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మంత్రులు దామోదర రాజ నరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అనసూయ (సీతక్క) ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారన్నారు. జిల్లా ప్రజలు పెద్ద మొత్తంలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిళ్ల వేణు, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, నాయకులు వేముల సంజీవ్, బానేష్, గడ్డం త్రిమూర్తి, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.