మహేశ్వరం, నవంబర్ 8: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి పునాది పడింది. రంగారెడ్డి జిల్లా కందుకూర్ మం డలం మీర్‌ఖాన్‌పేట నెట్ జీరో వ్యాలీలో ఎంఈఐఎల్ డైరెక్టర్ రవి పీ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ జీ శివకుమార్ శుక్రవారం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.
అక్టోబర్ 26న భవన నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కుదిరిన అవగాహన ఒప్పందంపై ఎంఈఐఎల్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి, విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ వీఎల్‌వీఎస్‌ఎస్ సుబ్బారావు సంతకాలు చేసిన విషయం తెలిసిందే. ఈ భవన నిర్మాణానికి ఎంఈఐఎల్ రూ.200 కోట్లు ఖర్చు చేయనుంది.
ఈ సందర్భంగా ఎంఈఐఎల్ డైరెక్టర్ రవి పీ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ విద్యార్థులకు, యువతకు నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో ఈ బృహత్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగ్యస్వాములుగా ఉన్నందుకు మెఘా సంస్థకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.
తెలంగాణ అవతరణ దినోత్సవంలోపు యూనివర్సిటీ మొదటి దశ పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ మదన్‌కుమార్, వెంకటేశ్వర్లు, ఎంఈఐఎల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.