22-04-2025 10:46:28 AM
కామారెడ్డి టౌన్,(విజయక్రాంతి): కోటీశ్వరుడైన,లక్షాధికారైన ఒక బంధువు మన ఇంటికి వచ్చినప్పుడు ఆ బంధువు కాళ్లకు నీలిచ్చి ఇంట్లోకి ఆదరించి కూర్చోమనం మన ఆచారం. అలాగే కామారెడ్డి లోని 15వ వార్డులో నివాసముండే భూమేష్ యాదవ్ మండు వేసవికాలంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ప్రతి ఇంటికి రెండు డ్రమ్ములు చొప్పున మంచినీటి సౌకర్యం కల్పిస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుత రోజుల్లో తన అవసరం తీరిపోతే చాలు అనుకునే సమాజంలో నేనున్నానంటూ ముందుకు వచ్చిన భూమేష్ యాదవ్ ప్రతిరోజు ప్రజలకు దాహార్తిని తీరుస్తూ వార్డు ప్రజల మన్ననలు పొందుతున్నారు.
ప్రస్తుతం కామారెడ్డి లోని ఎన్నో వార్డులు ఇలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. భూమేష్ యాదవ్ లాంటి దయార్థ హృదయులు ముందుకు వచ్చి ప్రస్తుత వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం మంచినీటి వసతి లేని ఎన్నో వార్డులు ఉన్నాయి అక్కడ కూడా ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేపడితే ఎంతో బాగుంటుందని పలువురు కోరుకుంటున్నారు. భూమేష్ యాదవ్ లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎంతోమంది ముందుకు వస్తే ప్రజల దాహార్తిని తీర్చిన వాళ్ళు అవుతారు. ఇప్పటికైనా గొప్ప మనసున్న వ్యక్తులు ముందుకు వచ్చి ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పిస్తారని భావిస్తున్నారు. గొప్ప మనసున్న వ్యక్తులు ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించి ఆదర్శంగా నిలుస్తారని భావిద్దాం.