calender_icon.png 19 November, 2024 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భుజంగరావు బెయిలు పొడిగింపు

19-11-2024 02:42:00 AM

28 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడో నిందితుడైన మాజీ అదనపు ఎస్పీ ఎన్ భుజంగరావుకు ఈ నెల 28 వరకు మధ్యంతర బెయిలును పొడిగిస్తూ సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

అనారోగ్య కారణాల నేపథ్యంలో జారీ చేసిన మధ్యంతర బెయిలు గడువు గత వారంతో ముగి యడంతో దాన్ని పొడిగించడానికి నాంపల్లి కోర్టు తిరస్కరించడంతో భుజంగరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విష యం విధితమే.

దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కే సుజన సోమవారం విచారణ చేపట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ఫోన్ ట్యాపింగ్ కేసు లో నిందితుడైన మేకల తిరుపతన్న బెయిలు పిటిషన్ సుప్రీం కోర్టులో ఉందని తెలిపారు.

బెయిల్‌ను ఈ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, దీనిపై సుప్రీం కోర్టు ఈ నెల 27న విచారణ చేపట్టనుందని, సుప్రీం కోర్టు నిర్ణయం తరువాత ఇక్కడ పిటిషన్ విచారణ చేపట్టాలని కోరారు. దీనికి న్యాయమూర్తి అనుమతిస్తూ భుజంగరావు మధ్యంతర బెయిలును ఈ నెల 28 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే తేదీన బెయిలు పిటిషన్‌పై విచారణ చేపడతామని తెలిపారు.

రాధాకిషన్‌రావు బెయిలు పిటిషన్ 21కి వాయిదా

ఫోన్ ట్యాపింగ్ కేసులోనే మరో నిందితుడైన పీ రాధాకిషన్‌రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈనెల 21కి వాయిదా వేశారు. సుప్రీంకోర్టు కేసు నేపథ్యంలో రాధాకిషన్‌రావు బెయిలు పిటిషన్‌పై విచారణను వాయిదా వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు కోరారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది ఈ ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ చేపట్టిన స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్‌కు చెందిన వ్యక్తి కాదనగా.. న్యాయమూర్తి విచారణను ఈనెల 21కి వాయిదా వేశారు.

ఉమాశంకర్‌రెడ్డికి బెయిల్

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మూడో నిందితుడైన గజ్జల ఉమాశంకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్‌తోపాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.

ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయం త్రం 5లోగా పులివెందుల ఎస్‌హెచ్‌వో ఎదుట హాజరుకావాలని చెప్పింది. హైదరాబాద్ సీబీఐ కోర్టులోని వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ప్రక్రియలో ఏరకంగానూ జోక్యం చేసుకోరాదని సూచించింది. పాస్‌పోర్టు ఉంటే సీబీఐ కోర్టుకు స్వాధీనం చేయాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది.

విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకున్నా, సాక్షులను ప్రభావితం చేసినా బెయి లు రద్దు చేయాలంటూ దరఖాస్తు చేసుకోవచ్చని సీబీఐకి సూచించింది. కోర్టులో కేసు విచారణ పూర్తి చేయడానికి సహకరించాలని స్పష్టంచేసింది.

వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఉమాశంకర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై విచారించిన జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం ఈమేరకు తీర్పు వెలువరించారు. పిటిష నర్‌కు సంబంధించి గతంలో ఎలాంటి నేర చరిత్రలేదని, దర్యాప్తు సందర్భంగా సహకరించాలేదన్న ఎలాంటి ఆరోపణలు లేనందున బెయిలు మంజూరు చేస్తున్నట్టు తీర్పులో  పేర్కొన్నారు.

పీజీ అడ్మిషన్ల స్థానిక వివాదంపై విచారణ 25కు వాయిదా

హైదరాబాద్, నవంబర్ 18          (విజయక్రాంతి): పీజీ మెడికల్ అడ్మిషన్లలో స్థానికత వివాదానికి సంబంధించిన పిటిషన్లపై విచారణ ఈనెల 25కు వాయిదా పడింది. పీజీ మెడికల్ అడ్మిషన్ల నిబంధనలకు సవరణ తీసుకువస్తూ జారీ చేసిన జీవో 148 సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలో క్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం సోమవా రం విచారణ చేపట్టింది.

పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది బీ మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ జీవో ప్రకారం తెలంగా ణలో ఎంబీబీఎస్ చేసిన వారిని మాత్రమే స్థానికులుగా పరిగణిస్తారని తెలిపారు. తెలంగాణకు చెంది న అభ్యర్థులు మెరిట్‌పై ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చేసినవారిని స్థానికేతరులుగా పేర్కొంటున్నారని చెప్పారు.

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై కౌంటరు దాఖలు చేయడానికి గడువు కావాలని కోరారు. ఈ నెల 25లోగా అడ్మిషన్లకు చెందిన మెరిట్ జాబితాను ప్రకటించబోమని హామీ ఇచ్చారు. దీంతో ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.