calender_icon.png 15 November, 2024 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూదాన్ భూముల్ని అమ్ముకు తిన్నరు

15-11-2024 02:04:14 AM

  1. నిజాం పాలనలోనూ ఇలా చేయలేదు
  2. వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీపై హైకోర్టు ఆశ్చర్యం

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): భూదాన్ భూముల్ని అధికారులు అమ్ముకుని తినేశారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిజాం కాలంలో కూడా ఈ తీరుగా చేయలేదని పేర్కొంది. భూదాన్ భూములంటూ ఆర్డీవో ఇచ్చిన ఉత్తర్వులను అప్పీలేట్ ట్రైబ్యునల్ అథారిటీగా ధ్రువీకరించిన వ్యక్తే.. రంగారెడ్డి కలెక్టర్‌గా వారసత్వ ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది.

పేదల కోసం రామచంద్రారెడ్డి 300 ఎకరాలను ఇవ్వగా అమ్ముకుని తినేశారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వ్యవసాయ భూముల సీలింగ్ చట్టం అమల్లోకి వచ్చినపుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తన 500 ఎకరాల భూమిని ఇచ్చారని కొనియాడింది. ప్రస్తుత కేసులో 10 ఎకరాల భూమి భూధాన్ బోర్డుకు చెందిదని ధ్రువీకరించాక, వారసత్వ ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నంబర్ 182 లో 10.29 ఎకరాలకు ఖాదర్ ఉన్నీసా బేగంకు వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ భూమిలో వాటా ఉన్న నవాబ్ పూర్ అలీఖాన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి గురువారం విచారణ జరిపారు.

గతంలో ఆ భూములను భూదాన్ భూములుగా స్పెషల్ ట్రైబ్యునల్ సమర్థించగా.. ట్రైబ్యునల్‌కు నేతృత్వం వహించిన అధికారే కలెక్టర్ హోదాలో ఖాదర్ ఉన్నీసా బేగం ఇచ్చిన దరఖాస్తును ఆమోదించి పట్టాదార్ పాస్ బుక్స్ ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీచేశారన్నారు. ఈ భూములకు సంబంధించి యథాతథ స్థితి కొనసాగించాలంటూ ఇదే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసినా పట్టించుకోలేదని చెప్పారు.

వాదనల తర్వాత.. భూదాన్ వివాదం పెండింగ్లో ఉండగా పాస్‌బుక్స్ జారీకి ఎలా ఆదేశాలు ఇచ్చారో చెప్పాలని ప్రభుత్వ అధికారులను హైకోర్టు నిలదీసింది. యధాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని యంత్రాంగానికి ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.