29-04-2025 04:44:35 PM
ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్...
మహబూబాబాద్ (విజయక్రాంతి): బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చి రైతుల భూములకు లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో పడేసి, రైతులకు ఎలాంటి చిక్కులు లేకుండా కొత్త చట్టాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని, భూభారతి చట్టంతో ఇక భూముల సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్(MLA Dr. Jatoth Ramachandru Naik) అన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో మంగళవారం భూభారతి చట్టం 25 అమలు తీరుపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, కలెక్టర్ కే.వీర బ్రహ్మచారి, ఆర్డీవో గణేష్ తో కలిసి రైతులకు నూతన భూభారతి చట్టం అమలు తీరుపై వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రైతుల భూ సమస్యలకు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చూపే విధంగా భూభారతి చట్టంలో అనేక చర్యలు రూపొందించడం జరిగిందన్నారు. ఉచితంగా న్యాయ సేవలతో పాటు సమస్యలపై దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆయా స్థాయిల్లో అధికారులు చర్యలు తీసుకునే విధంగా చట్టం చేయడం జరిగిందన్నారు. పూర్తిగా పారదర్శకంగా భూ సమస్యలను పరిష్కరించి రైతులకు ఎక్కడ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో ల్యాండ్ సర్వే అడిషనల్ డైరెక్టర్ నరసింహమూర్తి, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, తహసిల్దార్ సునీల్ రెడ్డి, ఎంపీడీవో వివేక్ రామ్ తదితరులు పాల్గొన్నారు.