calender_icon.png 26 April, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలకు పెనుభూతమైన ధరణి స్థానంలో భూభారతి

26-04-2025 04:44:57 PM

రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్..

తుంగతుర్తి (విజయక్రాంతి): ఎన్నో సమస్యలకు కారణమైన ధరణి స్థానంలో భూ భారతిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ వెల్లడించారు. శనివారం మద్దిరాల మండల కేంద్రంలోని మధు గార్డెన్ లో మద్దిరాల తహసిల్దార్ అమీన్ సింగ్ అధ్యక్షతన భూభారతి చట్టంపై  ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు జిల్లా అడిషనల్ కలెక్టర్ రాంబాబు(Additional Collector Rambabu)తో కలిసి రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం రైతులకు చుట్టంగా పనిచేస్తుందని అన్నారు.

గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి అనే చట్టంతో  పేదల భూములను కొల్లగొట్టిన బిఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమాలను భూ భారతి చట్టం ద్వారా బయటికి తీస్తామని హెచ్చరించారు. రైతులు పారదర్శకంగా, వేగంగా తమ భూ వివరాలు తెలుసుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, వారసత్వ నమోదు లాంటి సౌకర్యాలు పొందేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. మొత్తంగా దీర్ఘకాల భూ సమస్యలకు భూ భారతి శాశ్వత పరిష్కారం చూపుతుందని తెలిపారు. ధరణిలో భూ సమస్యల కోసం అప్పీల్ వ్యవస్థ లేదని, కోర్టులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఉండేదని.. భూ భారతిలో రెండంచెల అప్పీల్ వ్యవస్థను తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇటువంటి భూభారతి చట్టంతో రైతులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని అన్నారు.

ఈ సందర్భంగా రైతులు అడిగిన ప్రశ్నలకు అడిషనల్ కలెక్టర్ సమాధానం చెబుతూ సవివరంగా వివరించారు. అనంతరం రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో గజమాల తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేణు మాధవ రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, మద్దిరాల మండల స్పెషల్ ఆఫీసర్ అగ్రికల్చర్ నాగయ్య, ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారిని అనిషా రూహి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆవిలమల్లు యాదవ్,రెవిన్యూ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.