calender_icon.png 8 January, 2025 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు మేలు చేసేందుకే భూభారతి

08-01-2025 01:45:15 AM

* ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం

* త్వరలో నూతన గ్రామ రెవెన్యూ వ్యవస్థ

* ట్రెసా డైరీ ఆవిష్కరణ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): రైతులకు మేలు చేసేందుకే రాష్ట్రప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) డైరీని ఆవిష్కరించి మాట్లాడారు.

సర్కార్ ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరి స్తున్నదని, ఎన్నికల ముందు బదిలీ అయిన తహసీల్దార్లను సంక్రాంతి లోపే తిరుగి బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే బదిలీలకు సంబంధించిన దస్త్రాన్ని పంపించాల రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించామని వెల్లడించారు.

ఉద్యోగులంతా నిజాయితీగా పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. నూతన గ్రామ రెవెన్యూ వ్యవస్థతో పాటు 33 మంది సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపినప్పటికీ, సమయాభావం వల్ల క్యాబినెట్ కమిటీ ఆమోదించలేకపోయిందని తెలిపారు.

వచ్చే క్యాబినెట్ కమిటీ సమా వేశంలో తప్పనిసరిగా ఆమోదిస్తామని హామీ ఇచ్చారు. ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ద్వారా భూరికార్డులకు సంపూర్ణ భద్రత ఉంటుందన్నారు. రైతులు అప్పీలు చేసుకునేందుకు వీలుగా చట్టం ఉందని హర్షం వ్యక్తం చేశారు.

సాధారణ బదిలీల్లో భాగంగా ప్రభుత్వం డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లను సుదూ ర ప్రాంతాలకు బదిలీ చేసిందని, వారిని సొంత జిల్లాలకు తిరిగి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామ రెవెన్యూ వ్యవస్థ అమలుకు ప్రభుత్వం పూనుకోవడం హర్షణీయమన్నారు.

రెవెన్యూశాఖ పరిధిలో పనిచేస్తున్న 613 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు అనేక పేర్లు మనుగడలో ఉన్నాయని, వారందరినీ ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి, వారికి రెగ్యులర్‌గా వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం ముఖ్య సభ్యులు చంద్రమోహన్,  ఏనుగు నరసింహారెడ్డి, విజయేందర్‌రెడ్డి, పడిగెల రాజ్‌కుమార్, రియాజుద్దీన్, కోశాధికారి వెంకటేశ్వరరావు, నిరంజన్‌రావు, నాగమణి, నారాయణరెడ్డి, మనోహర్, చక్రవర్తి పాల్గొన్నారు.