29-04-2025 01:08:02 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
కాటారం, ఏప్రిల్ 28 (విజయక్రాంతి) : భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం సులభం , పారదర్శకమైనదని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం పలిమెల, మహాదేవ పూర్ మండల కేంద్రాలలోని రైతు వేదికలో భూ భారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టం 2025 పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన భూ భారతి చట్టం యొక్క ప్రాముఖ్యతను పవర్ పాయింట్ ద్వారా వివరించి, ప్రజలు అడిగిన సమస్యలకు సమాధానాలు తెలియచేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ సామాన్యులకు బడుగు, బలహీన వర్గాల ప్రజలందరికీ సత్వర సేవలు భూ భారతి చట్టం ద్వారా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
భూ సమస్యలు పరిష్కారానికి దరణిలో సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని, కానీ భూ భారతి చట్టంలో క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి సమస్యలకు పరిష్కార మార్గం చూపుతారని అన్నారు. భూ సమస్యలు పరిష్కారానికి ప్రజలకు సులువుగా, సులభతర పారదర్శకమైన చట్టం అందుబాటులోకి తేవాలని, ప్రభుత్వం నిపుణుల కమిటీ చేత దేశ వ్యాప్తంగా విచారణ చేసి నూతన భూ భారతి చట్టాన్ని తెచ్చినట్లు తెలిపారు.
తద్వారా క్షేత్రస్థాయిలోనే సమస్యలను పరిష్కరించుకోవడం కోసం పకడ్బందీ ప్రణాళికా ప్రకారం ముందుకు సాగుతున్నామని రైతులు, ప్రజలు, అన్ని వర్గాల వారు ఈ నూతన రెవెన్యూ చట్టం పై అవగాహన పెంచుకొని వారి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఈ అవగాహన సదస్సులో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, పలిమెల తహసిల్దార్ అనిల్, ఎంపీడీవో శ్రీనివాస్, మహాదేవపూర్ తహసిల్దార్ ప్రహ్లాద్ రాథోడ్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారి పాల్, పిఎసిఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.