calender_icon.png 13 May, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారానికే భూ భారతి

23-04-2025 08:32:11 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

మందమర్రి (విజయక్రాంతి): భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి అమలు చేస్తుందనీ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంలో పొందుపరిచిన అంశాలు, హక్కులపై మండల రైతులకు అవగాహన కల్పించారు. మండలంలోని సండ్రోన్ పల్లి రైతు వేదికలో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై బుదవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంతో భూ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, చట్టంలోని ప్రతి అంశాన్ని, ప్రతి హక్కును ప్రతి రైతు పూర్తిగా తెలుసుకోవాలని కోరారు.

ఈ చట్టంలో హక్కులు, రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం కల్పించడం జరిగిందని, రిజిస్ట్రేషన్, ముటేషన్ చేసేందుకు ముందు భూముల వివరాలు పూర్తి స్థాయిలో సర్వే చేసి, మ్యాప్ తయారు చేయడం జరుగుతుందని, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని, వారసత్వంగా వచ్చిన భూములకు విరాసత్ చేసే ముందు నిర్ణీత కాలంలో సమగ్ర విచారణ చేయడం జరుగుతుందన్నారు. పాసు పుస్తకాలలో భూమి పటం, భూ సమస్యల పరిష్కారానికి అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, భూధార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, రైతులకు ఉచిత న్యాయ సహాయం, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణతో పాటు మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం, భూదాన్, అసైన్డ్, దేవాదాయ, వర్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అవకాశం వంటి అంశాలను పొందు పర్చడం జరిగిందని వివరించారు.

భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఏప్రిల్ 30 వరకు జిల్లాలోని అన్ని మండలాలలో సదస్సులు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, ఇందు కొరకు కార్యచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు. ఎంపిక చేసిన మండలంలో జూన్ 2 వరకు సమస్యలు పరిష్కరించి, మిగిలిన మండలాలలోని సమస్యలను గుర్తించి, ఆగస్టు 15 లోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

గ్రామాలలో నెలకొన్న సమస్యలపై దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, సర్వే ప్రక్రియలో సంబంధిత సర్వేయర్లు, ఇతర అధికారుల నియామకంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గ్రామస్థాయిలోని సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని, రైతులకు పట్టాభూమి, లావుని పట్టా, ఇతర రకాల భూములకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వ ఆదేశాలు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, టైటిల్, పొసెషన్ సంబంధిత సమస్యలు, కోర్టులో కొనసాగుతున్న కేసులను మినహాయించి, మిగిలిన వాటిని పరిష్కరించడం జరుగుతుందని వివరించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..

మండలంలోని సారంగపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. రైతు సంక్షేమం దృష్ట్యా జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతుల వద్ద నుండి నాణ్యమైన వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, నీడ, ఓఆర్ఎస్, గోనె సంచులు, టార్పాలిన్లు, తూకం యంత్రాలు ఇతర అన్ని మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించి, మద్దతు ధర పొందాలని, సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందించడం జరుగుతుందన్నారు.

అనంతరం గ్రామంలో పొలాలలో వరి కోత ప్రక్రియను పరిశీలించారు. వరి కోత సమయంలో హార్వెస్టర్ పంకా వేగం 19గా నిర్వహించాలని, పంట పూర్తిగా కోత దశకు వచ్చిన తరువాత మాత్రమే కోయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె అనిత, మండల తహశీల్దార్ సతీష్ కుమార్, మండల ఎంపీడీవో ఎన్ రాజేశ్వర్, పట్టణ మున్సిపల్ కమీషనర్ తుంగపిండి రాజలింగులతో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.