20-04-2025 05:34:10 PM
నూతన ఆర్ఓఆర్ చట్టంతో రైతులకు మేలు...
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి...
చెన్నూర్ (విజయక్రాంతి): భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంను ప్రవేశపెట్టిందని, ఇందులో పొందుపరిచిన అంశాలను రైతులు తెలుసుకోవాలని చెన్నూర్ శాసన సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి(MLA Gaddam Vivek Venkataswamy) అన్నారు. ఆదివారం చెన్నూర్ లోని మైనారిటీ ఫంక్షన్ హాల్ భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak), జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ తో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టం ద్వారా హక్కులు, రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం కల్పించడం జరిగిందని, రిజిస్ట్రేషన్, ముటేషన్ చేసేందుకు ముందు భూముల వివరాలు పూర్తి స్థాయిలో సర్వే చేసి, మ్యాప్ తయారు చేయడం జరుగుతుందని, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని, వారసత్వంగా వచ్చిన భూములకు విరాసత్ చేసే ముందు నిర్ణీత కాలంలో సమగ్ర విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు.
భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించినా ముటేషన్ చేసి రికార్డులో నమోదు చేయడం జరుగుతుందని, పాసు పుస్తకాలలో భూమి పటం, భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, భూధార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, రైతులకు ఉచిత న్యాయ సహాయం, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణతో పాటు మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం, భూదాన్, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అవకాశం వంటి అంశాలను పొందు పర్చడం జరిగిందని తెలిపారు. భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంపై రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక మండలాన్ని ఎంపిక చేసి మండలంలోని అన్ని రకాల సమస్యలను తెలుసుకొని నిర్ణీత గడువులోగా పరిష్కరించడం జరుగుతుందని, సంబంధిత పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాలలో సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. మండల కేంద్రంలోని 100 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇందిరా మహిళా శక్తి పథకం లో భాగంగా చెన్నూర్ మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, తహశిల్దార్ మల్లికార్జున్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.