23-04-2025 06:38:44 PM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్...
భైంసా (విజయక్రాంతి): భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి (ఆర్వోఆర్) చట్టం నిలుస్తుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) తెలిపారు. బుధవారం భైంసా మండలంలోని వానల్ పాడ్, తానూరు మండలంలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. భూభారతి చట్టం ద్వారా భూ రికార్డుల నిర్వహణను సమర్థవంతంగా చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా ఉండేలా ఈ చట్టం రూపొందించబడిందని అన్నారు.
గ్రామ రెవెన్యూ అధికారులను నియమించడం ద్వారా భూసమస్యల పరిష్కారానికి వారు ప్రత్యక్షంగా బాధ్యత వహించనున్నట్లు పేర్కొన్నారు. భూభారతి చట్టాన్ని రూపొందించేందుకు అనేక రాష్ట్రాల భూ చట్టాలను విశ్లేషించి, నిపుణులు, రెవెన్యూ అధికారులు దీని రూపకల్పనలో భాగస్వాములైనట్లు వెల్లడించారు. గతంలో భూ సమస్యల కారణంగా చాలా మంది ప్రజలు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చిందని, భూభారతితో అలాంటి సమస్యలు తలెత్తే అవకాశం లేదని అన్నారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డిఓ కోమల్ రెడ్డి తాసిల్దార్ లో అధికారులు రైతులు పాల్గొన్నారు.