22-04-2025 12:59:37 AM
నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి
గద్వాల, ఏప్రిల్ 21 ( విజయక్రాంతి ) : భూ భారతి చట్టం రైతులకు చుట్టంలా సకల సమస్యలకు పరిష్కార వేదికగా ఉంటుందని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి అన్నారు. సోమవారం ఆలంపూర్ లోని బి.ఆర్.ఎస్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం-2025 పై అవగాహన సదస్సు కార్యక్రమంలో అలంపూర్ శాసన సభ్యులు విజయుడు,జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ తో కలిసి పాల్గొని, భూభారతి చట్టంపై, అందులోని అంశాలపై వివరిస్తూ రైతులకు అవగాహన కల్పించారు.
అనంతరం పలువురి అనుమానాలు,సందేహాలు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లిమెంట్ సభ్యులు మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి’ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. రైతుల పక్షపాతిగా,వారి సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్య మంత్రి భూభారతి చట్టం అమలు చేస్తున్నారని అన్నారు.
గతంలో రైతులు ధరణి పోర్టల్ ద్వారా చాలా ఇబ్బందులు అనుభవించారని, కార్యాలయాల చుట్టు కాళ్లు అరిగేలా తిరిగారని, అధికారులు కూడా నిస్సహాలుగా ఉండి పోయారని అన్నారు.ఈ దుస్థితిని మారుస్తూ, పేద రైతుల కన్నీళ్లను తుడిచే ఉద్దేశంతో డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ జయంతి నాడు భూభారతి చట్టాన్ని ప్రారంభించామన్నారు. గతంలో ఇచ్చిన హామీల ను నిలబెట్టుకుంటూ రైతులకు న్యాయం చేస్తున్నామని పేర్కొన్నారు.
పెండింగ్లో ఉన్న సాదా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ప్రభుత్వం అన్ని కోణాలలో, మేధోమథనం చేసిన మీదట సమగ్ర అంశాలను పొందుపరుస్తూ భూభారతి చట్టానికి రూపకల్పన చేయడం జరిగిందన్నారు.
అనంతరం అలంపూర్ శాసనసభ్యులు విజయుడు మాట్లాడుతూ, నియోజక వర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు భూ భారతి చట్టంపై అవగాహన పెంపొందించుకొని దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, డి.సి.సి.బి చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి,గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, అలంపూర్ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ దొడ్డప్ప,అలంపూర్ తహసీల్దార్ మంజుల, మున్సిపల్ కమిషనర్ చంద్ర శేఖర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.