16-04-2025 02:01:02 AM
ప్రతీ మండలంలో అవగాహన సదస్సులు.. అధికారులకు కలెక్టర్ ప్రావీణ్య ఆదేశం
హనుమకొండ, ఏప్రిల్ 15 (విజయ క్రాంతి): ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం జిల్లాలో అమల్లోకి వచ్చిందని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టానికి సంబంధించిన మార్గదర్శకాల పై జిల్లాలోని తహషీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
నూతన చట్టం లో కల్పించిన హక్కులు, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సాదా బైనామాల క్రమబద్దీకరణ, అప్పీల్ వ్యవస్థ, రివిజన్ అధికారాలు, న్యాయ సహాయం, గ్రామ రెవెన్యూ రికార్డులు, తదితరాంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరకాల, హనుమకొండ ఆర్డీవోలు డాక్టర్ నారాయణ,రాథోడ్ రమేష్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ భూభారతి చట్టం గెజిటె ప్రతులు, జీవో నెంబర్ పత్రాలు ప్రతి తహసిల్దార్, డిప్యూటీ తహషీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల వద్ద తప్పనిసరిగా ఉండాలన్నారు.
ఈనెల 17వ తేదీ నుండి ప్రతి మండలంలో అమలులోకి వచ్చిన భూభారతి చట్టానికి సంబంధించిన అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రతి మండలంలో ఒకే రోజు రెండు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. గ్రామాలలో నిర్వహించే సదస్సులకు స్థానిక ఎమ్మెల్యే తో పాటు భూమి హక్కులకు సంబంధించి అవగాహన ఉన్న వ్యక్తులను, మీసేవ కేంద్రాల ఆపరేటర్లను సదస్సులకు ఆహ్వానించాలన్నారు. ప్రజలు రైతులకు అనువైన ప్రదేశంలో సదస్సును నిర్వహించాల న్నారు .
తహసిల్దార్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలన్నారు. చట్టంలోని అంశాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా సదస్సు నిర్వహించాలన్నారు. ప్రజలు భూ సమస్యలపై వెల్లడించిన అభిప్రాయాలను నమోదు చేయాలన్నారు. ధరణి స్థానంలో వచ్చిన భూభారతి చట్టం మార్గదర్శకాలు తహసిల్దార్ల లాగిన్లకు వచ్చాయని అన్నారు.
నూతన చట్టం మార్గదర్శకాల ప్రకారం చేయాలన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజలు దరఖాస్తులు అందించినట్లయితే వాటిని స్వీకరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, తహశీల్దార్లు, నాయబ్ తహసిల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.