calender_icon.png 22 April, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సమస్యల పరిష్కారానికే భూభారతి

22-04-2025 12:24:05 AM

ఆర్వోఆర్ చట్టంపై రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, ఏప్రిల్ 21 (విజయక్రాంతి) : భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంలో పొందుపరిచిన అంశాలను రైతులు తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం న స్పూర్ మండలం సీతారాంపల్లి గ్రామంలో గల రైతువేదికలో భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు, తహసీల్దార్ శ్రీనివాస్ లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. పాసు పుస్తకాలలో భూమి పటం, భూ సమస్యల పరిష్కారానికి అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, భూధార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, రైతులకు ఉచిత న్యాయ సహాయం, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణతో పాటు మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం, భూదాన్, అసైన్డ్, దేవాదాయ, వర్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అవకాశం వంటి అంశాలను పొందు పర్చడం జరిగిందని తెలిపారు.

భూభారతి నూతన ఆర్.ఓ. ఆర్. చట్టంపై రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాలలో సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఎంపిక చేసిన మండలంలో జూన్ 2వ తేదీ వరకు సమస్యల పరిష్కరించి, మిగిలిన మండలాలలోని సమస్యలను గుర్తించి ఆగస్టు 15వ తేదీ లోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలపై దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, సర్వే ప్రక్రియలో సంబంధిత సర్వేయర్లు, ఇతర అధికారుల నియామకంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 

గ్రామస్థాయిలోని సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని, రైతులకు పట్టాభూమి, లావుని పట్టా, ఇతర రకాల భూములకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వ ఆదేశాలు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, టైటిల్, పొసెషన్ సంబంధిత సమస్యలు, కోర్టులో కొనసాగుతున్న కేసులను మినహాయించి మిగిలిన వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంలో పొందుపరిచిన అంశాలను రైతు ప్రయోజనం దిశగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.