calender_icon.png 30 April, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి చట్టం.. పేదలకు చుట్టం

30-04-2025 01:12:22 AM

  1. భూ సమస్యలు లేని తెలంగాణే లక్ష్యం
  2. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ఖమ్మం, ఏప్రిల్ 29 (విజయక్రాంతి) /హనుమకొండ/ఎల్లారెడ్డి, ఏప్రిల్ 29: చట్టం పేద ప్రజలకు చుట్టంగా ఉండాలన్న ఉద్దేశంతోనే భూభారతి చట్టాన్ని రూపొందించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణను భూ సమస్యలు లేని రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతోనే భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. మంగళవారం వరంగల్ తూ ర్పు నియోజకవర్గ పరిధిలోని ఉర్సుగుట్ట, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలం శెట్‌పల్లి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామాల్లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుల్లో మంత్రి పొంగులేటి మాట్లాడారు.

జూన్ 2 వరకు పైలెట్ మండలాల్లో భూ సమస్యలను గుర్తించి, ఆగస్టు 2 నుంచి శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు వెళ్తామన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టంలో ఆర్‌ఓఆర్ మ్యుటేషన్‌లో వివాదాలు ఉంటే కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఈ వివాదాలపై అప్పీల్ చేసుకునే అవకాశం కూడా లేదని తెలిపారు. భూ భారతిలో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు, వారం రోజుల గడువుతో నోటీసులు ఇచ్చి సమస్యను పరిష్కరించడానికి వీలుందని వెల్లడించారు.

భూ భారతి ద్వారా మన భూమికి నాలుగు దిక్కుల్లో ఎవరెవరు ఉన్నారు, వాటి సర్వే నంబర్లతో కూడిన మ్యాప్ ఉంటుందని తెలిపారు. దీనివల్ల మన భూమి హద్దులను ఎవరూ చెరపలేరని అన్నారు. ధరణిని అడ్డం పెట్టుకొని గత పాలకులు వేల ఎకరాలను ఆక్రమించుకున్నారని ఆరోపిం చారు. ధరణి ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని అధికారులకు సూచించారు.

కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి చూడలేక బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు దుఃఖం వస్తుందని పొంగులేటి అన్నారు. కామారెడ్డి జిల్లా షట్‌పల్లిలో భూ సమస్యలపై ఇప్పటికే 400 దరఖాస్తులు వచ్చాయని మంత్రి తెలిపారు. ఇంకా రెండు గ్రామాలలో రెవెన్యూ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారని రెండు రోజుల్లో దరఖాస్తుల స్వీకరణ పూర్తి అవుతుందని అన్నారు. 

10,956 మంది అధికారులు..

గతంలో మాదిరిగానే గ్రామస్థాయి లో మళ్లీ రెవెన్యూ వ్యవస్థ వస్తుందని, త్వరలోనే 10,956 మంది రెవెన్యూ అధికారులు కొలువుతీరుతారని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. 6,000 మందికి సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి లైసెన్సులు అందజేసి భూముల సర్వేకు పం పుతున్నామని వెల్లడించారు.

శెట్పల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్, ఎంపీ సురేష్ షెట్కార్, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వ న్, ఎస్పీ రాజేష్ చంద్ర, ఆర్డీవో మన్నే ప్రభాకర్ పాల్గొన్నారు. ఉర్సుగుట్టలో మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ కలెక్టర్ సత్య శారద దేవి, నగర మే యర్ గుండు సుధారాణి, ఆర్డీ వో సత్యపాల్‌రె డ్డి పాల్గొన్నారు.