భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భారత ప్రభుత్వం తన అత్యంత ప్రతిష్టాత్మకమైన బేటీ బచావో బేటీ పఢావో పథకాన్ని 22 జనవరి 2015 లో ప్రారంభించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(District Collector Jitesh V Patil) ఈ పథకం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బుధవారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బేటీ బచావో బేటీ పఢావో లో ముఖ్యంగా బాలికలు ఎదుర్కొంటున్న, సమాజంలో అంతర్లీనంగా ఉన్న వివక్షను పరిష్కరించడం కోసం సిబ్బంది పనిచేయాలన్నారు. ఆడపిల్లలను రక్షించడంతో పాటు లింగ-ఆధారిత అసమానతలను తొలగిస్తూ ఆడపిల్లలకు సరైన పెరుగుదల, విద్యావకాశాలు, పుట్టుకకు సంబంధించి మెరుగైన అభివృద్ధికి అందరూ కృషిచేయాలని కోరారు. బాలికల భద్రత రక్షణ వంటి అంశాలపై ఎక్కువగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ... మునగాకు తరచూ తినడం వలన రక్తహీనతకు దూరమవుతారని మునగ మొక్కలు నాటడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టాలు గురించి వివరించి, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రేమ పేరుతో బాలికలు మోసపోకూడదని కోరారు. అవగాహన, ప్రేరణాత్మక, స్ఫూర్తిదాయక విషయాలపై ఇంకా అవగాహన కార్యక్రమాలు నేటి నుండి మార్చి 8 వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి స్వర్ణలత లెనీనా, బాలల సంరక్షణ అధికారి హరి కుమారి, మహిళా సాధికారత కోఆర్డినేటర్ సంతోష రూప, టి.ఎస్.డబ్లు.ఆర్.జే.సి విద్యార్థినులు, భారతి, మాధవి మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ జాహేద, సాహితీ, అకౌంటెంట్ ప్రియాంక, స్వాతి, మౌనిక తదితరులు పాల్గోన్నారు.