calender_icon.png 8 October, 2024 | 5:00 AM

భవీశ్, కునాల్ సోషల్ మీడియా వార్

08-10-2024 02:44:15 AM

ఓలా ఎలక్ట్రిక్ షేర్లు డౌన్!

ముంబయి: విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ షేర్లు  మరోసారి పతనమయ్యాయి. ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదైన ఈ కంపెనీ.. గరిష్ఠ స్థాయిల నుంచి దాదాపు 43 శాతం క్షీణించింది. కంపెనీ సేవలపై ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ఫిర్యాదులు దీనికి కారణమయ్యాయి. సోమవారం సైతం ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేరు 8 శాతం మేర క్షీణించి రూ.90.37 వద్ద ట్రేడయ్యాయి.

తాజా పతనానికి కంపెనీ సీఈఓ భవీశ్ అగర్వాల్, ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మధ్య సోషల్ మీడియాలో నడిచిన వివాదమే కారణమని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీసుల గురించి కమెడియన్ ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో వీరి మధ్య వివాదం మొదలైంది.

ఓలాకు తగినన్ని సర్వీసు సెంటర్లు లేవని, దీంతో కస్టమర్లు విసుగు చెందుతున్నారని పేర్కొంటూ తొలుత కునాల్ పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన భవీశ్ అగర్వాల్ ‘నీ కామెడీ కెరీర్ పూర్తవడంతోనే ఇలాంటి పెయిడ్ పోస్టులు పెడుతున్నావు’ అంటూ విరుచుకుపడ్డారు. 

దీనికి ప్రతిగా కునాల్ సైతం ‘అసంతృప్తితో ఉన్న కస్టమర్లకు పూర్తి రిఫండ్ ఇవ్వగలరా?’ అంటూ సవాల్ విసిరారు. ఇలా సీఈఓ, కమెడియన్ మధ్య నెలకొన్న ఈ మాటల యుద్ధంలో కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.