calender_icon.png 15 January, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధతోనే భట్టి విక్రమార్క వ్యాఖ్యలు

01-08-2024 02:23:16 AM

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మొదటిసారి అసెంబ్లీలో నోరు విప్పి తన బాధను చెప్పుకొన్నారని, ఐదేళ్ల తర్వాత తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. భట్టి తాను దళితుడినని, సామాజిక వర్గం పేరును ఎప్పుడూ రాజకీయంగా వాడుకోలేదన్నారు. నిండు సభలో దళితుడిని అనే పదం ఇప్పుడు వాడారంటే, భట్టి ఎంత బాధతో మాట్లాడారో అర్థం చేసుకోవాలన్నారు. సీఎల్పీ నేతగా భట్టివిక్రమార్క ఉన్నప్పుడే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారని గుర్తుచేశారు. ఫలితంగా సభలో ప్రతిపక్ష హోదా లేకుండా పోయిందన్నారు. ఆ సందర్భంలోనే సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారిన అంశం చర్చకు వచ్చిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సభలో ఎవరి పేరూ ప్రస్తావించకుండా వ్యాఖ్యలు చేశారని స్పష్టం చేశారు.

కేటీఆర్ చేతిలో బీఆర్‌ఎస్ కనుమరుగు

కేటీఆర్ చేతిలో బీఆర్‌ఎస్ కనుమరుగవుతుందని ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.  హరీశ్‌రావుకు బాధ్యతలు అప్పగిస్తే ఆ పార్టీ బతుకుతుందని చెప్పారు. అసెంబ్లీ లాబీలో మాట్లాడుతూ.. హరీశ్‌రావును అణదొక్కేందుకు కొందరు బీఆర్‌ఎస్ నేతలు శతవిధాలా ప్రయతిత్నస్తున్నారన్నారు. 

బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మలేదు: మంత్రి శ్రీధర్‌బాబు 

అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మలేదని, కాంగ్రెస్‌ను నమ్మి తమకు అధికారం కట్టబెట్టారని ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. ద్రవ్యవినిమియ బిల్లుపై జరిగిన చర్చలో కేటీఆర్ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విమర్శించగా మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. గులాబీ పార్టీ 2014, 2018లో ప్రకటించిన మ్యానిఫెస్టోనే తిరిగి 2023లోనూ ప్రకటించారని ఎద్దేవాచేశారు. దళితుడిని సీఎం చేస్తానని ఆ పార్టీ అధినేత మాట తప్పారన్నారు. సామాజిక న్యా యం గురించి మట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదన్నారు. మూసీని కూడా థేమ్స్, మహేశ్వరం నియోజకవర్గాన్ని న్యూయార్క్‌లా అభివృద్ధి చేస్తానని సీఎం హామీ ఇవ్వలేదన్నారు. కానీ ఆ స్ఫూర్తితో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.