హైదరాబాద్: ఢిల్లీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియతో చిట్ చాట్ చేశారు. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ దే నిర్ణయమన్నారు. ప్రజాపాలన పట్ల 50 శాతానికిపైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని భట్టి వెల్లడించారు. ప్రభుత్వ పాలన పట్ల వందశాతం సంతోషంగా ఉంటారనుకోవట్లేదని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యం అంటే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందన్నారు. హైడ్రాకు ధనిక, పేద తేడా లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. చెరువులను ఎవరు ఆక్రమించినా హైడ్రా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
నియోజకవర్గాల పరిధిలో 25 ఎకరాల్లో సమీకృత స్కూళ్లు నిర్మిస్తామన్నారు. తెలంగాణ తల్లి గతంలో అధికారికంగా లేదని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ తరఫున మాత్రమే తెలంగాణ తల్లి ఉండేదన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలనే నిబంధన లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ రూల్స్ మార్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు రూ. 64 వేల కోట్ల అసలు, వడ్డీ కట్టామని చెప్పారు. పాలనపై దృష్టిపెట్టినందునే ప్రచారంలో వెనుకబడ్డామని వివరించారు. ఈ నెల 14 నుంచి హాస్టళ్లలో విద్యార్థులతో కలిసి భోజనాలు చేయనున్నామని తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి మంత్రులు భోజనం చేస్తారని ఆయన వెల్లడించారు.