calender_icon.png 30 September, 2024 | 1:00 PM

భస్మాసుర హస్తం

30-09-2024 02:20:24 AM

కాంగ్రెస్ గుర్తుగా బుల్డోజర్‌ను పెట్టుకోండి

పెద్దలను వదిలి పేదల ఇళ్లు కూలుస్తున్న సర్కార్

బాధితుల ఇళ్లకు బుల్డోజర్లు వస్తే అడ్డు మేం వెళ్తాం

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు

హైదర్షాకోట్, లంగర్‌హౌస్ మూసీ బాధితులకు పరామర్శ

హైదరాబాద్, రాజేంద్రనగర్, కార్వా న్ సెప్టెంబర్ 29: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఆపన్న హస్తం కాదని, భస్మాసుర హస్తంగా మారిందని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యమంటే పేదల ఇండ్లు కూలగొట్టడమేనా? అని ప్రశ్నించారు.

ఆదివారం ఆయన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరి ధిలోని హైదర్షాకోట్‌తోపాటు లంగర్‌హౌస్‌లోని ఆశంనగర్, డిఫెన్స్ కాలనీలో మూసీ బాధితులను పరామర్శించారు. హైదర్షాకోట్ చౌరస్తాలోని కేంద్రీయ విహార్ వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో ఉన్న పేదల ఇండ్లు కూల్చేస్తున్న ప్రభు త్వం.. పెద్దల ఇండ్ల జోలికి ఎందుకు పోవటం లేదని ప్రశ్నించారు.

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడి ఇండ్లు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉన్నాయని, వాటిని ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బుల్డోజర్ పాలన కొనసాగుతోందని, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును తొలగించి జేసీబీ గుర్తు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

మూసీలో మంచి నీరు పారిస్తామంటున్నారని, మొదట అందులో మురికి నీరు పారకుండా చర్యలు తీసుకోవాలని చురకలంటించారు. పేదల ఇళ్లు తీసుకుంటున్న సర్కారు.. మరి అదే మూసీ పక్కన 40 అంతస్తుల భారీ టవర్ కడుతుంటే ఎందుకు ముట్టుకోవటం లేదని నిలదీశారు.

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కూలిపోయిందంటూనే గోదావరి నీళ్లు తెస్తామంటున్నారని, కాళేశ్వరం లేకుండా గోదావరి నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లులు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదని, రేవంత్ మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.  

కాలనీకో ఎమ్మెల్యే కాపలా ఉంటాం

మూసీ నది వెంట పేదల ఇండ్లు కూలగొట్టడానికి ప్రభుత్వం బుల్డోజర్లను పంపితే మొదట తామే అడ్డు నిలబడతామని, బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలమంతా కవచంలా ఏర్పడి ఇళ్లను కూల్చకుండా అడ్డుకుంటామని తెలిపారు.

హైడ్రా తీరుతో ఇప్పటికే ముగ్గురు బాధితులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇకపై ఎవరి ప్రాణాలు పోకుండా తాము అండగా ఉండి రక్షణ కవచంలా ఉంటామని పేర్కొన్నారు. అవసర మైతే కాలనీకి ఒక ఎమ్మెల్యేను కాపలా పెడతామని బాధితులకు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పిదాలకు పేద ప్రజలు ఎందుకు బలి కావాలని ప్రశ్నించారు. 

మూడు రెట్ల పరిహారం ఇవ్వాలి 

మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇళ్లను ప్రభుత్వం తీసుకుంటే ప్రభుత్వ రేటుకు మూడు రెట్లు పరిహారం ఇవ్వాలని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ డిమాండ్ చేశారు. బాధితులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు అనుకూలంగా ఇచ్చి అందులో వసతులతో పాటు ఫర్నిచర్ కూడా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితారెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎమ్మె ల్యేలు కాలేరు వెంకటేష్, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మా బతుకులెట్ల?

మూసీ సుందరీకరణలో భాగంగా ప్రభు త్వం నదీ గర్భంలో ఉన్న ఇండ్లను తొలగించాలని నిర్ణయించటంతో వాటి యజమా నులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ నేతల వద్ద బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పు చేసి ఇల్లు కట్టుకొన్నామని, ఇప్పుడు ఖాళీ చేయాలని ఆదేశిస్తే ఎలా బతకాలని ఓ తొమ్మిది నెలల నిండు చూలాలు బోరున విలపించారు.

ప్రభుత్వ తీరుతో కొన్నిరోజులుగా తనకు నిద్ర కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తన కొడుకు హైదర్షాకోట్‌లో ఇల్లు కొనుగోలు చేయడానికి తన రిటైర్‌మెంట్ డబ్బులు రూ.40 లక్ష లు ఇచ్చానని, ఇప్పుడు సర్కారు ఇల్లు కూల్చేస్తే తమ పరిస్థితి ఏం కావాలని ఓ వృద్ధుడు ప్రశ్నించాడు. తన భర్త శ్రీప్రసాద్ సిన్హా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్నాడని, తమ ఇంటిని కూడా అధికారులు కూలుస్తామంటున్నారని ఓ సైనికుడి భార్య ఆందోళన వ్యక్తంచేశారు. 

తాటాకు చప్పుళ్లకు భయపడం

కాంగ్రెస్ సర్కారు చేస్తున్న తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని మాజీ మం త్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నా రు. ఆరు నూరైనా ఒక్క ఇల్లును కూడా కూల్చకుండా అడ్డుకుంటామని ప్రకటించారు. హైడ్రాతో హైదరాబాద్‌లోని మం చి వాతావరణాన్ని చెడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు పూర్తయిందని, ఇప్పు డు కేవలం 800 మాత్రమే మిగిలి ఉన్నాయనని తెలిపారు. వాటిని 16 వేల మం దికి ఇవ్వడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.  ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రభు త్వాలు ఎక్కువ కాలం నిలవబోవన్నారు. 

ముందు మురికి తొలగించండి

రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకర ణ పేరుతో పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని, ముందుగా మూసీలోకి మురికినీరు రాకుండా చేయాలని హరీష్‌రావు సూచించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ మూసీ సుంద రీకరణ కోసం లక్షన్నర కోట్ల రూపాయ లు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు.

‘ఆసలు మీ ప్రాధాన్యత ఏమిటి? పేద పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టడమా? లక్ష కోట్లు ఖర్చుచేసి మూసీని సుందరీకరణ చేయడమా? ఇటీవల నేను, సబితా ఇంద్రారెడ్డి గాంధీ ఆసుపత్రికి వెళ్తే రోగులకు మందులు లేక అవస్థలు పడు తున్నారు. డబ్బులు చెల్లించకపోవడం తో ఏజెన్సీలు ప్రభుత్వానికి మందుల సరఫరా నిలిపివేశాయి.

ఈ ప్రభుత్వం ఒక తుగ్లక్ ప్రభుత్వంగా మారి పిచ్చోడిచేతుల రాయిలా తయారైంది. సుంద రీకరణ పేరుతో సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఫార్మాసిటీకి కేసీఆర్ 15 వేల ఎకరాల భూమి సేకరిస్తే బ్రోకర్ల సహాయంతో ఫోర్త్ సిటీ నిర్మిస్తానని రేవంత్ చెప్తున్నారు’ అని మండిపడ్డారు.