మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని భరోసా వెల్ఫేర్ సొసైటీ సామాజిక సేవలతో పాటు విద్యార్థులకు టాలెంట్ పరీక్షల నిమిత్తం చేయుతనందిస్తోంది. సేవా కార్యక్రమాల్లో భాగంగా మణుగూరు మండల పరిధిలోని ముత్యాలమ్మ నగర్ బాలవెలుగు పాఠశాల విద్యార్థులు ఏకలవ్య టాలెంట్ పరీక్షలు రాసేందుకు కావలసిన పరీక్ష ఫీజుల నిమిత్తం బుధవారం రూ.5 వేలను అందించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మణుగూరు సింగరేణి అదనపు మేనేజర్ వి అప్పారావు మాట్లాడుతూ.. విద్యార్థులు కృషి, పట్టుదలతో చదువులో రాణించి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.
సామాజిక సేవలో భరోసా వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న విశేష కృషిని ఆయన అభినందించారు. సొసైటీ విద్యా రంగంలోనే కాకుండా, రక్తదాన కార్యక్రమాల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా విశేష సేవలు అందించి పలువురు రోగులకు అత్యవసర పరిస్థితుల్లో రక్తాన్ని అందజేస్తూ, అపరిమిత ప్రాణాలను రక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. మణుగూరు ప్రాంతంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రక్తదానం సేవలను విస్తరించి, ఎన్నో కుటుంబాలకు ఆశాజ్యోతి అందిస్తున్నందుకు భరోసా వెల్ఫేర్ సొసైటీని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు జగన్ మోహన్ రెడ్డి, ఓసీ ప్రాజెక్ట్ మేనేజర్ రాంబాబు, సేఫ్టీ ఆఫీసర్, భరోసా వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షులు లింగబాబు, సుధాకర్, భరోసా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అమీన్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.