29-03-2025 08:29:26 AM
సెంటర్ నిర్వాహకుల ముందే బాధితులపై దాడి.
నాగర్ కర్నూల్, విజయక్రాంతి: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కేంద్రంలోని భరోసా సెంటర్ వద్ద ఓ యువకుడు బాధితుల పట్ల దాడికి దిగుతూ మహిళ ఉద్యోగులను బెదిరిస్తూ వీరంగం సృష్టించాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామానికి చెందిన మంజుల బద్రీనాథ్ ఇరువురి భార్యాభర్తల మధ్య గత కొంత కాలంగా విభేదాలు తలెత్తాయి. అందుకు కారణం భరోసా సెంటర్లోనే సపోర్టు పర్సన్ గా పని చేస్తున్న ఓ మహిళ తన భర్తను బుట్టలో వేసుకొని తనకు దూరం చేస్తుందని బాధిత మహిళ మంజుల భరోసా సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో భరోసా సెంటర్ లో పనిచేస్తున్న ఆ మహిళ సోదరుడు సెంటర్లోకి చొరబడి బాధిత మహిళ తన భర్త బద్రి లపై దాడికి దిగాడు. అక్కడే ఉన్న మహిళా ఉద్యోగులపై కూడా బెదిరింపులకు పాల్పడుతూ వీడియో కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం భరోసా సెంటర్ ఇన్చార్జ్ ఎస్సై వీణ వారికి సర్ది చెప్పి కుటుంబ విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచన చేశారు. భరోసా సెంటర్ వద్ద హంగామా చేసిన యువకుడిపై చర్యలు ఉంటాయని ఎస్సై వీణ తెలిపారు. అనంతరం బాధితురాలికి సఖి సెంటర్ ఇన్చార్జ్ సునీత ఆశ్రయం కల్పించారు.