calender_icon.png 21 October, 2024 | 3:14 PM

భారత్ వృద్ధి భేష్

18-07-2024 12:05:00 AM

7% అంచనాల్ని ప్రకటించిన ఐఎంఎఫ్, ఏడీబీలు

న్యూఢిల్లీ, జూలై 17: ప్రస్తుత ఏడాది భార త్ ఆర్థిక వ్యవస్థ జోరుగా వృద్ధిచెందుతుందని అంతర్జాతీయ ఏజెన్సీలు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్), ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)లు ప్రకటించాయి. 2024 సంవత్సరానికి ఐఎంఎఫ్ ఏప్రిల్‌లో వెల్లడించిన 6.8 శాతం వృద్ధిరేటు అంచనాను తాజాగా 7 శాతానికి పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏడీబీ గతంలో ప్రకటించిన 7 శాతం వృద్ధి అంచనానే పునరుద్ఘాటించింది.

సగటుకంటే అధికంగా రుతుపవనాలు ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో వ్యవసాయ రంగం మెరుగైన పనితీరు ప్రదర్శించనున్నందున భారత్ 7 శాతం వృద్ధి సాధిస్తుందని ఏడీబీ బుధవారం విడుదల చేసిన నివేదికలో వివరించింది. ఏడీబీ నివేదిక వెలువడకముందే భారత్ వృద్ధి రేటు అంచనాల్ని 7 శాతానికి పెంచుతున్నట్టు ఐఎంఎఫ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది. రిజర్వ్‌బ్యాంక్ భారత్ జీడీపీ వృద్ధి రేటు అంచనాల్ని 7 శాతం నుంచి 7.2 శాతానికి గత నెలలోనే పెంచిన సంగతి తెలిసిందే. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 8.2 శాతం వృద్ధిచెందగా, అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి రేటును కనపర్చింది. 

వచ్చే ఏడాది 7.2 శాతానికి వృద్ధి

ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి చెందుతుందని, వచ్చే 2025 ఆర్థిక సంవత్స రంలో ఈ వృద్ధి రేటు 7.2 శాతానికి పెరుగుతుందని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అవుట్‌లుక్ (ఏడీవో) జూలై ఎడిషన్‌లో అంచనాల్ని ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ ఏడీవోలో సైతం ఇవే అంచనాల్ని ఏడీబీ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో ద్రవ్యో ల్బణం 4.6 శాతం మేర ఉంటుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది స్వల్పంగా 4.5 శాతానికి తగ్గుతుందని ఏడీవో అంచనాల్లో పేర్కొంది. 2024 మార్చితో ముగిసిన క్యూ4లో భారత్ సర్వీసులు రంగం జోరుగా వృద్ధిచెందిందని, రానున్న త్రైమాసికాల్లో కూడా దీర్ఘకాలిక సగటుకంటే అధికంగానే సర్వీసుల పీఎంఐ (పర్చేజర్ మేనేజర్స్ ఇండెక్స్) ఉంటుందని ఏడీబీ పేర్కొన్నది.

హౌసింగ్ నేతృత్వంలో నిర్మాణ రంగానికి పటిష్ఠమైన డిమాండ్ ఉంటుందని, తయారీ రంగం కూడా తోడ్పాటు ఇవ్వడంతో పారిశ్రామిక రంగం కూడా గణనీయంగా వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. 2023 ఆర్థిక సంవత్సరంలో నిస్తేజమైన వృద్ధి రేటు కనపర్చిన వ్యవసాయ రంగం ఈ ఏడాది పుంజుకుంటుందని తెలిపింది. అయితే సర్వీసుల రంగం మద్దతుతో ఎగుమతులు వృద్ధి చెందనున్నప్పటికీ, వస్తూత్పత్తుల ఎగుమతుల వృద్ధి బలహీనంగా ఉంటుందని ఏడీబీ అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వపు ద్రవ్య పరిస్థితి అంచనాలకంటే మెరుగ్గా ఉండటం వృద్ధికి మరింత ఊతమిస్తుందని పేర్కొంది. కానీ వాతావరణ మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వృద్ధిని దెబ్బతీయవచ్చని హెచ్చరించింది.

గ్రామీణ వినియోగం దన్ను

ప్రైవేటు వినియోగం ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్ పుంజుకుంటున్నందున భారత్ వృద్ధి రేటు అంచనాల్ని పెంచుతున్నట్టు ఐఎంఎఫ్ విడుదల చేసిన తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్‌లో పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ ఎడిషన్‌లో 2024 సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 6.8 శాతం ఉంటు ందని అంచనా వేసిన ఐఎంఎఫ్ తాజాగా ఈ అంచనాల్ని 7 శాతానికి పెంచింది. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.5 శాతానికి మందగి స్తుందని అంచనా వేసింది.  అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధిలో సగం వృద్ధిని ఇండియా, చైనాలే అందిస్తాయని ఐ ఎంఎఫ్ ఎకానమిక్ కౌన్సిలర్, రీసెర్చ్ డైరెక్టర్ పియరీ ఓలివర్ పేర్కొన్నారు.