28-03-2025 07:42:24 PM
కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నెట్వర్క్ టవర్ల నిర్మాణాల కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్ రావు, కాగజ్ నగర్ డివిజనల్ అటవీ అధికారి సుశాంత్ బొగాడే, బీఎస్ఎన్ఎల్ నిజామాబాద్ సర్కిల్ జనరల్ మేనేజర్ వి.వెంకటేశ్వర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్. జి. జగ్రామ్ లతో కలిసి నెట్వర్క్ టవర్ల నిర్మాణాలపై శాఖ అధికారులు, తహసిల్దార్లు, అటవీ రేంజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... గతంలో జిల్లాల మంజూరైన 9 టవర్లలో 8 టవర్ల నిర్మాణాలకు ఎలాంటి ఆటంకాలు లేనందున వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి అనుమతులు పొంది టవర్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాకు అదనంగా 16 టవర్లు మంజూరయ్యాయని, ఈ టవర్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్లు కిరణ్, దత్తు ప్రసాద్, అటవీ రేంజ్ అధికారులు, బి.ఎస్.ఎన్.ఎల్. ఇంజనీర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.