మాలి సంఘం రాష్ర్ట అధ్యక్షుడు సుకుమార్
ఆదిలాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): సామాజిక న్యాయం, సమసమాజ నిర్మాణం కోసం, విద్యావ్యాప్తి కోసం అహర్నిశలు కృషిచేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల సేవల్ని గుర్తించి కేంద్ర ప్రభుతం భారతరత్న బిరుదు ఇచ్చి గౌరవించాలని అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ర్ట అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పూలే గెస్ట్ హౌస్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మాలి మహా సంఘం క్రియాశీల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో జ్యోతిబాఫూలే జయంతి, వర్ధంతిని అధికారికంగా నిరహించాలని కోరారు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతి (జనవరి 3)ని అధికారికంగా నిరహించాలని తీర్మానించారు. సమావేశంలో మాలి సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు సురేష్ గురునులే, రాష్ర్ట కోశాధికారి సతీష్ గురునులే, జిల్లా అధ్యక్షుడు విజయ్ వాడగురే, జిల్లా, రాష్ర్ట కార్యవర్గ సభ్యులు దాసు షెండే, రామ్ కిషన్ షిండే, కౌడు వాసాకే కిషన్ పెట్కులే పాల్గొన్నారు.