27-03-2025 12:00:00 AM
ప్రముఖ సంఘసంస్కర్త జ్యోతిరావు ఫూలే, ఆయన సతీమణి సావిత్రీబాయి ఫూలేను దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’తో సత్కరించాలని కేంద్రాన్ని కోరుతూ మహారాష్ట్ర అసెంబ్లీ రెండు రోజుల క్రితం ఏకగ్రీవంగా తీర్మానించడం ముదావహం. ఇది వారి వారసత్వాన్ని గౌరవించడమే కాకుండా సమానత్వం, కుల ఆధారిత వివక్షను అంతమొందించడంలాంటి వాటి కోసం వారు జరిపిన పోరాటానికి తగిన గుర్తింపు ఇవ్వడమే అవుతుంది.
స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ల తర్వాతనైనా మహారాష్ట్రకు చెందిన తొలి సంఘ సంస్కర్త దంపతులను ‘భారత రత్న’ ద్వారా గౌరవించాలని కోరుకోవడం నిజంగా వారికి తగిన నివాళి. ఇప్పుడంటే మహిళలు స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్నారు. విదేశాలకూ వెళ్తున్నారు. కానీ ఫూలే హయాంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆడపిల్ల పాఠశాలలో అడుగుపెట్టడమే పాపంగా భావించే వారు. మహిళలు ఇంటిపనికి, వంట పనికిమాత్రమే పరిమితమయ్యే వారు.
వీటికి వ్యతిరేకంగా మాట్లాడితే సంఘంనుంచి బహిష్కరించే వారు. అలాంటి రోజుల్లో అచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థుర్యైం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. 19వ శతాబ్దానికి చెందిన జ్యోతిరావు ఫూలే గొప్ప సంఘ సంస్కర్త, ఆలోచనా పరుడు, సంఘ సేవకుడు, రచయిత, తత్వ వేత్త, విప్లవ కార్యకర్త. ఆయన జీవితమంతా మహిళలకు విద్యాహక్కు కల్పించడానికి, బాల్య వివాహాలను అరికట్టడానికి కృషి చేశారు. ఫూలే సమాజాన్ని మూఢనమ్మకాల నుంచి విముక్తం చేయాలన్నారు.
తన 63 ఏళ్ల జీవిత ప్రయాణంలో మహిళల పురోగతికి ఆయన సాధించిన విజయాలు, చేసిన కృషి అనన్య సామా న్యమైనవి. జ్యోతిబాకు 1840లో సావిత్రీబాయితో వివాహం అయింది. పెళ్లయ్యే నాటికి చదువు రాని సావిత్రీబాయి భర్త ప్రోత్సాహంతో ఇంటివద్దనే చదువు నేర్చుకున్నారు. 1848లో జ్యోతిబా ఫూలే బాలికల కోసం పుణెలో దేశంలో తొలి మహిళా పాఠశాలను ప్రారంభించారు.
ఆపాఠశాలకు సావిత్రీబాయి మొదటి ఉపాధ్యాయురాలు. అప్పటి పరిస్థితుల్లో ఇది నిజంగా ఓ గొప్ప సాహసమే. ఈ కారణంగా ఫూలే దంపతులు సామాజికపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫలితంగా కొంతకాలం ఈ పాఠశాలను మూసివేయాల్సి వచ్చింది. అయితే మిత్రుల ప్రోత్సాహంతో తిరిగి ప్రారంభించడమే కాకుండా మరిన్ని పాఠశాలలను కూడా ఏర్పాటు చేశారు.
విద్యా రంగంలోనే కాకుండా ఫూలే బాల్య వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించారు. వితంతువులు తిరిగి వివాహం చేసుకునే హక్కును సమర్థించారు. సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి, శూద్రులను, ఇతర నిమ్న కులాలను ఏకం చేయడానికి, కుల వ్యవస్థ వల్ల కలిగే సామాజిక, ఆర్థిక అసమానతలను తిప్పికొట్టడానికి ‘సత్యశోధక్ సమాజ్’ అనే సంస్కరణ సంఘాన్ని స్థాపించారు.
తన ఆలోచనలను ప్రచారం చేయడానికి ఫూలే అనేక పుస్తకాలు, వ్యాసాలు, కవితలు, నాటకాలు రాశారు. ఆయ న రాసిన వాటిలో అత్యంత పసిద్ధ రచన ‘గులామగిరి’( బానిసత్వం). భార త దేశ కులవ్యవస్థపై దాడిగా గుర్తింపు పొందిన ఈ పుస్తకం దేశంలో దిగువ కులాల సభ్యుల స్థానాన్ని అమెరికాలో బానిసలతో పోల్చింది.
ఫూలే రచనలు దేశంలో కుల సంస్కరణల కోసం తర్వాత ఉద్యమాలు చేసిన వారికి ప్రేరణగా నిలిచాయి. అలాంటి వారిలో దళిత నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఉన్నారు. తనకు అత్యంత స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఫూలే అని అంబేద్కర్ స్వయంగా చెప్పారు. భర్తకు సావిత్రీ దేవి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా నిలిచారు. ఫూలే ఈ లోకాన్ని వీడి 135 ఏళ్లయినా ఆయన ఆదర్శాలు నేటి మహిళలను ముందుకు నడిపిస్తూనే ఉన్నాయి.
వారి సేవలకు గుర్తింపుగా ఎన్నో సంస్థలు, ల్యాడ్‌మార్క్‌లు నిచిపోయాయి. ముంబయిలోని ఫూలే మార్కెట్ అలాంటి వాటిలో ఒకటి. అలాంటి సంస్కరణ ఉద్యమ దంపతులను భారతరత్న పురస్కారంతో సత్కరించుకోవాలన్న గొప్ప ఆలోచన ఇప్పటికయినా మన నేతలకు కలిగినందుకు నిజంగా సంతోషం.