calender_icon.png 17 November, 2024 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ X ప్రవాస భారత్

12-06-2024 12:54:44 AM

నేడు అమెరికాతో టీమిండియా ఢీ

గెలిస్తే నేరుగా సూపర్-8కు

టీ20 ప్రపంచకప్ రాత్రి 8 నుంచి

ఒకవైపు చూస్తే మన టీమిండియా.. మరోవైపు చూస్తే  ఆ జట్టులో ఉన్న ఆటగాళ్లలో సగానికి పైగా మన భారతీయ మూలాలతో సంబంధం ఉన్నవారే. చిన్నప్పటి నుంచి తమ ఆరాధ్య ఆటగాళ్లను చూస్తూ పెరిగిన వారంతా ఇవాళ ఆతిథ్య హోదాలో టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. టోర్నీ ఆరంభంలో మహా అయితే ఒక మ్యాచ్ గెలిస్తే అదే గొప్ప అని భావిస్తే.. అంచనాలు తలకిందులు చేస్తూ దుమ్మురేపుతున్న అమెరికా.. మాజీ చాంపియన్ పాకిస్థాన్‌ను చిత్తు చేసి వార్తల్లో నిలిచింది.

ఇక నేడు టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది. మరోవైపు టీమిండియా మాత్రం సూపర్ బెర్తు లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అమెరికాను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుందనే విషయాన్ని జ్ఞప్తిలో పెట్టుకున్న రోహిత్ సేన హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లు ఎక్కువగా ఉండడంతో టీమిండియా, అమెరికాల మధ్య పోరు ఇండియా వర్సెస్ మినీ ఇండియాగా మారిపోయింది..!

న్యూయార్క్: టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా మరో కీలకపోరుకు సిద్ధమైంది. బుధ వారం న్యూయార్క్ వేదికగా ఆతిథ్య అమెరికాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఐర్లాండ్, పాకిస్థాన్‌పై విజయాలు సాధించిన రోహిత్ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సూపర్ అడుగుపెట్టాలని భావిస్తోంది. మరోవైపు సంచలన ప్రదర్శన కొనసాగిస్తున్న అమెరికా జట్టు టీమిండియాను ఓడించాలని ప్రయత్నిస్తోంది.

గత రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ప్రదర్శన చూసుకుంటే బ్యాటింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. బౌల ర్లు మ్యాచ్‌లు గెలిపించారు. ఐర్లాండ్ మ్యాచ్ పక్కనబెడితే పాక్‌తో పోరులో 120 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో టీమిండియా బౌలర్లు సఫలీకృతమయ్యారు. భారత్ ఇప్పటికే నసావు కౌంటీ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు ఆడగా.. ఆతిథ్య జట్టుకు ఇక్కడ ఇదే తొలి మ్యాచ్. బౌలర్లకు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్‌పై టీమిండియా బౌలర్లను తట్టుకొని అమెరికా ఎంతమేరకు నిలుస్తుందనేది ఆసక్తికరం. అయితే డ్రాప్ ఇన్ పిచ్‌ల్లో మ్యాచ్‌లు ఆడడం అమెరికాకు సానుకూలాంశం.

కోహ్లీ ఏ స్థానంలో..

గత రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా బ్యాటింగ్ ప్రదర్శన అనుకున్నంత మెరుగ్గా లేదు. న్యూయార్క్ పిచ్ బౌలర్లకు అనుకూలిస్తున్న మాట నిజమే కావొచ్చు.. కానీ కాస్త ఓపిగ్గా ఆడితే ఇక్కడ పరుగులు రాబట్టొచ్చు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఫిఫ్టీతో మెరిసిన కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. అయితే ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన విరాట్ కోహ్లీ మాత్రం ఇంకా తన ఆట ప్రారంభించలేదు. ఒత్తిడిలో ఆడడంలో కింగ్ అనిపించుకున్న కోహ్లీ రాణిస్తే జట్టుకు తిరుగుండదు. మరి కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వస్తాడా లేక తనకు అచ్చొచ్చిన మూడో స్థానంలో బరిలోకి దిగి అమెరికా పని పడతాడా అన్నది చూడాలి.

కోహ్లీ ఫామ్‌పై  ఎటువంటి సందేహాలు లేకున్నప్పటికీ అతని నుంచి భారీ స్కోరు మాత్రం బాకీ ఉంది. వన్‌డౌన్‌లో వస్తున్న రిషబ్ పంత్ టీమిండియాకు వెన్నుముకలా మారాడు. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ బ్యాటింగ్‌లో అదరగొట్టిన పంత్ వికెట్ల వెనకాల చురుగ్గా కదులుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అయితే మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబేలు విఫలమవ్వడం ఆందోళన కలిగిస్తోంది. తమదైన రోజున వీరిని ఆపడం ఎవరి తరం కాదన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లు త్వరగా ఔటైన తర్వాత పంత్‌కు సహకరించడంలో ఈ ఇద్దరు విఫలమయ్యారు. కనీసం నిలదొక్కుకునే ప్రయత్నం కూడా చేయలేక చెత్త షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మెరుస్తున్నప్పటికీ బ్యాటింగ్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. ఆల్‌రౌండర్ జడేజా కూడా నిరాశ కలిగిస్తుండగా.. అక్షర్ పటేల్ పర్వాలేదనిపిస్తున్నాడు. 

మనోళ్లే అధికం!

అమెరికా జట్టు విషయానికి వస్తే.. అందులో అత్యధిక శాతం మనవాళ్లే. గతంలో ఏదో ఒక దశలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వాళ్లు కొందరైతే.. పాకిస్థాన్, న్యూజిలాండ్ వంటి జాతీయ జట్లలో చోటు దక్కించుకోలేక అగ్రరాజ్యానికి వలస వచ్చిన వాళ్లు మరికొందరు. తాము అమితంగా అభిమానించే టీమిండియా ఆటగాళ్లతో అమీతుమీ తేల్చుకో వడం పెద్ద గౌరవమని ఇప్పటికే అమెరికా ప్లేయర్లు ప్రకటించగా.. మైదానంలో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది చూడాలి. పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ఒత్తిడిని సైతం తట్టుకున్న యూఎస్‌ఏ జట్టును తక్కువ అంచనాకు వేసేందుకు లేదు. ఎక్కడెక్కడో క్రికెట్ ఓనమాలు నేర్చుకొని జట్టుగా కలిసి ఆడుతున్న వారిని అడ్డుకోవాలంటే.. టీమిండియా ప్రయోగాలకు జోలికి వెళ్లకుండా పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగడమే ఉత్తమం. 

తిరుగులేని బౌలింగ్..

బ్యాటింగ్ సంగతి అటుంచితే బౌలింగ్‌లో మాత్రం టీమిండియా దుర్భేద్యంగా కనిపిస్తోంది. జస్‌ప్రీత్ బుమ్రా పెద్దన్న పాత్రను సమర్థంగా పోషిస్తూ అవసరమైన దశలో కీలక వికెట్లు తీస్తూ టీమిండియాకు విజయాలు సాధించిపెడుతున్నాడు. అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌లు బుమ్రాను అనుసరిస్తుండగా.. బౌలింగ్‌లో పాండ్యా మాత్రం కీలకంగా మారాడు. పేస్‌కు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్‌పై స్పిన్నర్లలో అక్షర్ పటేల్ ప్రభావం చూపిస్తుండగా.. జడేజా తేలిపోతున్నాడు. అమెరికాతో పోరుకు పాక్‌తో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగే అవకాశముంది. ఐపీఎల్లో అభిమానులతో అవమానాలు ఎదుర్కొన్న పాండ్యా.. బ్లూ జెర్సీలో పేస్ ఆల్‌రౌండర్‌గా తన విలువ చాటుకుంటున్నాడు. మేనేజ్‌మెంట్ అతడి నుంచి ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది.