calender_icon.png 19 October, 2024 | 12:13 PM

ఫిలిమ్ చాంబర్ కొత్త అధ్యక్షుడు భరత్ భూషణ్

29-07-2024 12:05:00 AM

తెలుగు ఫిలిమ్ చాంబర్ అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష బాధ్యతలు అశోక్‌కుమార్ నిర్వర్తించనున్నారు. ఆదివారం ఉదయం ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఎన్నికలు జరిగాయి. ఠాగూర్ మధు, భరత్ భూషణ్ అధ్యక్ష బరిలో నిలువగా.. మొత్తం 48 మంది సభ్యులకు గాను, 46 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల కమిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టింది. 29 ఓట్లతో భరత్ భూషణ్ ప్రథమ స్థానంలో నిలువగా, ఓటింగ్‌లో రెండోస్థానం పొందిన ఠాగూర్ మధుకు 17 ఓట్లు వచ్చాయి. ఉపాధ్య పదవి కోసం జరిగిన ఎన్నికల్లో అశోక్‌కుమార్ 28 ఓట్లతో మొదటి స్థానం దక్కించుకోగా, 18 ఓట్లు పొందిన వైవీఎస్ చౌదరికి రెండో స్థానం దక్కింది.

నిరుడు టీఎఫ్‌సీసీ నిర్వహించిన ఎన్నికల్లో నిర్మా తల మండలి తరఫున దిల్ రాజు బరిలో నిలిచి అధ్యక్ష పదవిని కైవ సం చేసుకున్నారు. ఈసారి అధ్యక్ష పదవి కోసం నిర్వహించిన ఎన్నికల్లో డిస్ట్రిబ్యూటర్స్ విభాగంలోని సభ్యుల మధ్యే పోటీ నెలకొంది. ఈ పోటీలో డిస్ట్రిబ్యూటర్ ఠాగూర్ మధు (నెల్లూరు)పై మరో డిస్ట్రిబ్యూటర్ భరత్ భూషణ్ (వైజాగ్) గెలుపొందారు. ఇక ఉపాధ్యక్ష పదవి కోసం నిర్మాతల విభాగం సభ్యులు తలపడ్డారు. నిర్మాత అశోక్‌కుమార్, మరో వైవీఎస్ చౌదరిపై విజయం సాధించారు. టీఎఫ్‌సీసీలో సభ్యులుగా ఉన్న నాలుగు సెక్టార్లకు చెందిన నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియోల యజమానులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. కొత్త కమిటీ ఏడాది పాటు పదవిలో కొనసాగనున్నది.